రాములమ్మ కామెడీ: కాంగ్రెస్‌ పార్టీ ఆ అవకాశమే ఇవ్వలేదట.!

‘నాకు కాంగ్రెస్‌ పార్టీ సరైన అవకాశాలు ఇవ్వలేదు. నేను జనంలో వుండడాన్ని ఇష్టపడతాను. నా ప్రజలంటే నాకు అమితమైన అభిప్రాయం. కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం, నేను అనుకున్నవి జరగలేదు. నన్ను జనంలోకి వెళ్ళనివ్వలేదు..’ అంటూ వాపోయారు సినీ నటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.

కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి ఇటీవలే బీజేపీలో చేరిన విజయశాంతి, ఇకపై జనంలో వుంటానని అంటున్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీలో వుండి, జనంలోకి వెళ్ళలేకపోయారు.. సోషల్‌ మీడియాలో ట్వీట్లు వేస్తూ టైమ్‌ పాస్‌ చేస్తున్నారన్న విమర్శలకు ఏం సమాధానం చెబుతారు.?’ అన్న ప్రశ్నకు, విజయశాంతి స్పందిస్తూ ‘కాంగ్రెస్‌ పార్టీ నాకు ఆ అవకాశమే ఇవ్వలేదు..’ అంటూ పెద్ద కామెడీనే చేశారు.

నిజానికి, కాంగ్రెస్‌ పార్టీలో ఆమెకు చాలానే అవకాశాలు వచ్చాయి. ఆ మాటకొస్తే, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఒకానొక దశలో ఆమె పెద్ద దిక్కు అయ్యే అవకాశమూ వచ్చింది. కానీ, ఆమె ఏ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై వెనక్కి తగ్గారు.. పార్టీ తరఫున స్టార్‌ క్యాంపెయినర్‌గా అవకాశమొస్తే మొహం చాటేశారు.. చెప్పుకుంటూ పోతే, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అవకాశాల్ని చాలానే ఆమె వదిలేసుకున్నారు.

‘బీజేపీ నుంచే నా రాజకీయ ప్రయాణం మొదలైంది.. ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకే వచ్చాను. ఈసారి రాజకీయంగా నా పవర్‌ ఏంటో చూస్తారు..’ అంటున్నారు విజయశాంతి. కానీ, విజయశాంతి రాజకీయాలెలా వుంటాయో ఆల్రెడీ తెలుగు ప్రజలు.. అందునా, తెలంగాణ ప్రజలు చూసేశారు. కొత్తగా విజయశాంతి నుంచి చిత్ర విచిత్రమైన రాజకీయాలైతే జనం ఆశించే పరిస్థితి లేదు.

కొన్నాళ్ళ తర్వాత ఆమె బీజేపీ అధిష్టానంపై అలకబూనడం మామూలే. కాంగ్రెస్‌లోలా బీజేపీలో బుజ్జగింపు వ్యవహారాలుండవు. ఆ విషయం ఆమెకు గతంలో అనుభవమే. కానీ, ఆ అనుభవాల నుంచి ఆమె పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడంలేదు. అన్నట్టు, కేసీఆర్‌ని విమర్శించే విషయంలో మాత్రం విజయశాంతి చూపిస్తున్న అత్యుత్సాహం, ఆటిట్యూడ్‌ ఓ రేంజ్‌లో వుంటున్నాయండోయ్‌.