తెలంగాణ సీఎం దళితుల కోసం దళిత బంధు పథకంను తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. రాష్ట్రంలోని దళితులు అందరికి కూడా ఆర్థిక సాయం చేసేందుకు గాను ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ స్కీమ్ పై విజయశాంతి విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో దళిత బంధును మొదలు పెట్టడం పూర్తిగా ఎన్నికల స్టంట్ అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. 20 వేల కుటుంబాలకు 2 వేల కోట్ల రూపాయలను హుజూరాబాద్ లో ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీఎం గతంలో దళితులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అంటూ ఆమె ఆరోపించారు. దళిత సీఎం మరియు దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వడం వరకు అన్ని విషయాల్లో కూడా కేసీఆర్ మాట తప్పాడు. అందుకే ఈ పథకం విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా మోసం చేస్తున్నాడు అంటూ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క దళితులకు ఈ పథకంను అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల నిధులు అవసరం అవుతాయని విజయశాంతి అన్నారు. కేసీఆర్ అనుకున్నట్లుగా ఈ పథకంను కార్యరూపం దాల్చాలంటే 165 సంవత్సరాలు పడుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.