సాగర్ బరిలో రాములమ్మ.. ఒప్పుకుంటుందా.? లేదా.?

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్)అకాలమరణంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరైంది. ఇటీవల దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగగా అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దుబ్బాకలో గులాబీ పార్టీకి షాకిచ్చిన కమలం పార్టీ, అంతకన్నా పెద్ద షాక్, గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇచ్చిన విషయం విదితమే. ఇప్పుడు ముచ్చటగా మూడో షాక్, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ద్వారా ఇవ్వాలని కమలనాథులు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థిగా విజయశాంతి పేరు వైపు మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో లోక్ సభకు ప్రాతినిథ్యం వహించిన విజయశాంతి, ఆ తర్వాత రాజకీయాల్లో మరీ అంత యాక్టివ్‌గా కనిపించలేదు. అయితే, బీజేపీలో చేరాక మాత్రం విజయశాంతి ఒకింత అత్యుత్సాహంగానే వున్నట్లు కనిపిస్తోంది. నేరుగా ఆమె ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని సవాల్ చేస్తున్నారు. ఈ లెక్కన ఆమె కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగానే వున్నట్లు భావించాలేమో.

అయితే, విజయశాంతితో ఏదీ అంత వీజీ కాదు. ఆమె రాజకీయ వ్యూహాలు ఎప్పుడెలా మారతాయో చెప్పలేం. బీజేపీ నుంచి బయటకు వచ్చి, తల్లి తెలంగాణ పార్టీ పెట్టి.. ఆ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిపేసిన విజయశాంతి, కేసీఆర్ దయతో ఎంపీగా లోక్ సభకు ఎంపికైన విషయం విదితమే. టీఆర్ఎస్‌ని వీడి, కాంగ్రెస్‌లో చేరి, కాంగ్రెస్ ముఖ్య నేతగా చెలామణీ అయ్యారు కూడా. అయినాగానీ, కాంగ్రెస్‌లోనే వుంటూ.. కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యిగా తయారయ్యారు. అంతకు ముందు గులాబీ పార్టీలోనూ ఆమె పాత్ర అదే. దాంతో, విజయశాంతి విషయంలో ఆచి తూచి వ్యవహరించాలనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది.

ఏమో, విజయశాంతి మనసులో ఏముందో.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసి, అసెంబ్లీకి వెళితే మాత్రం.. ప్రత్యక్షంగానే కేసీఆర్‌తో అసెంబ్లీ సాక్షిగా తలపడే అవకాశం ఆమెకు దక్కుతుంది.