విశాల్ ర‌హ‌స్యాలు ఏమై ఉంటాయ‌బ్బా

కోలీవుడ్ ప్ర‌ముఖ హీరో విశాల్ ఎప్పుడూ కాక‌పోయినా, అప్పుడ‌ప్పుడూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తుంటాడు. ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విశాల్‌కు మంచి గుర్తింపు వుంది. ఈయ‌న కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు. నిర్మాత‌గా కూడా రాణిస్తున్నాడు. తాజాగా ఆయ‌న గురించి ర‌మ్య అనే మ‌హిళ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

టాలీవుడ్‌లో కూడా అభిమానులు ఉండ‌డంతో విశాల్ గురించి ర‌మ్య ఆరోప‌ణ‌లు వైర‌ల్ అవుతున్నాయి. “విశాల్‌కు సంబంధించి చాలా విష‌యాలు నాకు తెలుసు. పోలీసుల ర‌క్ష‌ణ క‌ల్పిస్తే విశాల్‌కు సంబంధించి మ‌రిన్ని ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెడుతా” అని ఆమె బాంబు పేల్చింది. ఇప్పుడీ ఆరోప‌ణ‌లు కోలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

అస‌లు వివాదం ఎక్క‌డ త‌లెత్తిందో తెలుసుకుందాం. చెన్నైలోని వ‌డ‌ప‌ళ‌ని-కుమ‌ర‌న్ కాల‌నీలోని విశాల్‌కు ప్రొడ‌క్ష‌న్ కార్యాల‌యం ఉంది. ఆ కార్యాల‌యంలో ప‌ది మందికి పైగా సిబ్బంది ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌ల విశాల్ కార్యాల‌యంలో రూ.45 ల‌క్ష‌లు మోసం జ‌రిగింద‌న్న విష‌యం బ‌య‌ట ప‌డింది. దీనిపై కార్యాల‌య నిర్వాహ‌కుడు హ‌రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

ఆ ఫిర్యాదులో త‌మ కార్యాల‌య అకౌంటెంట్ ర‌మ్య మోసానికి పాల్ప‌డిన‌ట్టు పేర్కొన్నాడు. ఆదాయ శాఖకు చెల్లించాల్సిన టీడీయస్‌ను రమ్య ఆమె భర్త బ్యాంక్‌ అకౌంట్లు, తన బంధువుల బ్యాంకు అకౌంట్ల‌కు తరలింంచిందని వెల్ల‌డించాడు. అస‌లు వివాదం ఇక్క‌డ మొద‌లై విశాల్‌పై తీవ్ర ఆరోప‌ణ‌ల‌కు దారి తీసింది.

విశాల్‌పై ర‌మ్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డానికి బీజం అక్క‌డ ప‌డింది. ఒక చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌మ్య మాట్లాడుతూ హీరో విశాల్ కొన్నేళ్లుగా ఆదాయ‌ప‌న్ను శాఖ‌కు టీడీయ‌స్‌ను చెల్లించ‌కుండా మోసానికి పాల్ప‌డుతున్నాడ‌ని ఆరోపించారు. దాని నుంచి త‌ప్పించుకోడానికి త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు.

విశాల్ కార్యాల‌య నిర్వాహ‌కుడు హ‌రికి సంబంధించిన వాళ్లు త‌న ఇంటికొచ్చి బెదిరించార‌ని ఆమె ఆరోపించారు. పోలీసులు త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తే విశాల్ బండారాన్ని బ‌య‌ట పెడ‌తానంటూ ఆమె హెచ్చ‌రించారు. త‌న‌కు విశాల్‌కు స‌వ‌బంధించిన ర‌హ‌స్యాల‌న్నీ తెలుసున‌ని ఆమె చెప్పుకొచ్చారు.

కోలీవుడ్‌లో ర‌మ్య ఆరోప‌ణ‌లు హాట్ టాపిక్ అయ్యాయి. అస‌లు విశాల్‌కు సంబంధించి ఎలాంటి ర‌హ‌స్యాలు ర‌మ్య‌కు తెలుసు? ఆమె బ‌య‌ట పెట్టే ర‌హ‌స్యాలు విశాల్‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతాయి…త‌దిత‌ర కోణాల్లో కోలీవుడ్‌లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లే కోలీవుడ్‌లో ప్ర‌ముఖ హీరో, ఆపై ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ది ఆయ‌న కార్యాల‌య మ‌హిళా ఉద్యోగిని. ఈ నేప‌థ్యంలో వ్య‌వ‌హారం చివ‌రికి ఏ మ‌లుపు తీసుకోనుందో మ‌రి!