సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఏమైనా చేస్తా: విశ్వక్ సేన్

”అశోకవనంలో అర్జున కళ్యాణం” మూవీ ప్రమోషన్స్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టాయి. మే 6న తన సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో విశ్వక్ శరవేగంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నడిరోడ్డుపై ఒక యువకుడితో కలిసి సూసైడ్ ప్రాంక్ వీడియో చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమా ప్రచారం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి ఫ్రాంకులు చేస్తారా అంటూ ట్రోల్ చేశారు. అంతేకాదు విశ్వక్ సేన్ పై హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు కూడా చేసారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేయడం.. పబ్లిక్ కు అంతరాయం కలిగిస్తున్నారని అడ్వకేట్ అరుణ్ కుమార్ హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేశారు.

అయితే ఫ్రాంక్ వీడియో వివాదంపై చర్చించడానికి విశ్వక్ సేన్ ను ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ వారు డిబేట్ కు పిలిచారు. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోకి ఘోర అవమానం జరిగింది. చర్చలో భాగంగా విశ్వక్ మాటలకు అసహనం వ్యక్తం చేసిన యాంకర్.. గెటవుట్ అంటూ అతన్ని స్టూడియో నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

డిబేట్ జరుగుతున్న క్రమంలో విశ్వక్ సేన్ ను సదరు యాంకర్ ‘పాగల్ సేన్’ ‘డిప్రెస్డ్ పర్సన్’ అంటూ సంబోధించడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మాటలకు హార్ట్ అయిన విశ్వక్.. తనను పర్సనల్ గా టార్గెట్ చేసినందుకు పరువునష్టం దావా వేసే హక్కు ఉందని.. కానీ అలా చేస్తే వారికి తనకు తేడా ఏముందని విశ్వక్ అన్నారు.

అలాంటి మాటలు అనొద్దని.. మాటలను అదుపులో పెట్టుకొని మాట్లాడాలని గట్టిగా చెప్పారు. దీంతో సహనం కోల్పోయిన సదరు యాంకర్.. ‘గెట్ ఔట్’ అంటూ తన షో నుంచి వెళ్లిపోవాలని గట్టి గట్టిగా అరుస్తూ విశ్వక్ సేన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీరే ఇంటర్వ్యూకి పిలిచి.. మీరే నన్ను మాటలు అంటున్నారు అని చెబుతూ బయటకు వచ్చేసారు. అయినా సరే ఆ యాంకర్ ఆగకుండా నోరుమూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరవడం నెట్టింట సంచలనంగా మారింది. తాజాగా ఈ ఇష్యూ పై మరో ఛానల్ లో వివరణ ఇచ్చారు విశ్వక్.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన టీమ్ ఇది ప్లాన్ చేసిందని.. తనకు తెలిసినా సినిమాకు ప్రచారం అవసరం కాబట్టి అలా చేశానని విశ్వక్ అన్నారు. ఇది తన ఇంటికి దగ్గరలోనే జరిగిందని.. అది న్యూసెన్స్ కాదని.. అక్కడున్న వారందరూ ఈ ఫ్రాంక్ చూసి ఎంజాయ్ చేశారని.. ఆ క్యాన్ లో ఉంది పెట్రోల్ కాదు నీళ్ళని అందరికీ తెలుసన్నారు.

సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ లో భాగంగా ఏమైనా చేస్తానని విశ్వక్ అన్నారు. తన ఫ్రాంక్ వీడియో పై కేసు వేసినా ఫేస్ చేస్తానని.. కానీ ఫ్రాంక్ వీడియోలు చేసే అందరి మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదనన్నారు. దాని వల్ల ప్రతిభావంతులైన చాలామంది ఉపాధి కోల్పోతారని.. అందుకే మిగతా వారిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

డిబేట్ కోసం స్టూడియోకి పిలిచి గెటవుట్ అని అవమానించడం ఏమాత్రం కరెక్ట్ కాదని విశ్వక్ సేన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫ్రాంక్ వీడియో ఇష్యూ వల్ల ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాకు కావాల్సినంత ప్రచారం లభించిందని అంటున్నారు.