యావత్ భారతదేశాన్ని కుదిపేసింది విశాఖ గ్యాస్ లీక్ ఘటన. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువు లీక్ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘స్టైరీన్’ అనే రసాయనం అక్కడెలా ఎందుకు స్టోర్ చేశారు.? అన్నదానిపై రకరకాల వాదనలు విన్పిస్తున్నాయి. అసలు ఆ ప్లాంట్ విస్తరణకు అనుమతులే లేవనీ, అనుమతులు లభించకున్నా విస్తరణ చేశారనీ విపక్షాలు విమర్శిస్తున్న విషయం విదితమే. ఇక, ప్రమాదం తర్వాత ఆఘమేఘాలమీద స్టైరీన్‌ని విదేశాలకు తరలించారనుకోండి.. అది వేరే సంగతి.
తాజాగా హైకోర్టు, ఈ వ్యవహారంపై స్పందించింది. కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. పరిశ్రమ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశించింది. ఆ పరిశ్రమకు సంబంధించిన డైరెక్టర్ల పాస్‌పోర్టులు స్వాధీనపర్చాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ అలాగే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు విన్పించారు. గ్యాస్ లీక్ ఘటన తర్వాత స్టైరీన్‌ని ఎవరి అనుమతితో తరలించారంటూ న్యాయస్థానం ప్రశ్నించడం గమనార్హం.
పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యంతోపాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ప్యాకేజీని బాధితుల కోసం ప్రకటించినా, ఈ వ్యవహారంపై అనుమానాలున్నాయంటూ విపక్షాలు ఆరోపిస్తున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియా పోస్టింగ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అలా పోస్టింగ్స్ చేస్తున్నవారిపై ప్రభుత్వం కేసులు పెడుతుండడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఏది ఏమైనా, గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి ప్రజల్లో చాలా చాలా అనుమానాలున్నయి. ఈ మేరకు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అనుమానాల్ని ఇంకా ఇంకా సంధిస్తూనే వున్నారు. ఆ అనుమానాలన్నిటికీ త్వరలోనే సమాధానం దొరుకుతుందని ఆశిద్దాం.