స్టైరీన్.. తీయని వాయువుతో తీరని విషాదం

ఓ తీయని వాయువు తీరని విషాదాన్ని మిగిల్చింది. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషయవాయువు లీక్ కావడంతో ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన అలజడి నెలకొంది. ఇప్పటివరకు పది మంది మృత్యువాత పడగా.. దాదాపు 250 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇంతకీ ఈ వాయువు ఏమిటి? దాని ప్రభావం ఎంత ఉంటుంది? మనుషులు, జంతువులకు ఇది ఎంత హానికరం వంటి విషయాలు చూద్దాం. ప్రస్తుతం విశాఖలో లీకైన ఈ వాయువు పేరు స్టైరీన్.

సీ8హెచ్8 అనే ఫార్ములా కలిగిన స్టైరీన్ వాసన తీపిగా ఉంటుంది. స్టైరీన్ ను వినియోగించి సింథటిక్ రబ్బర్, పాలిస్టిరీన్ వంటివి తయారు చేస్తారు. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కు అవసరమైన ఉత్పత్తులతోపాటు డిస్పోజల్ కప్పులు, కంటైనర్లు దీనితో తయారవుతాయి. ఈ వాయువు మనుషులు పీలిస్తే.. కళ్ల మంటలు, వినికిడి సమస్యలు ఏర్పడతాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. కేంద్ర నాడీ వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా తలనొప్పి, వికారం, కళ్ల మంటలు, నీరసం, తీవ్ర ఆందోళన వంటివి చోటుచేసుకుంటాయి.

అధిక మోతాదులో ఈ గ్యాస్ పీలిస్తే కిడ్నీ సమస్యలతోపాటు కేన్సర్ బారిన కూడా పడే అవకాశం ఉంది. లాక్ డౌన్ కారణంగా 45 రోజులుగా పరిశ్రమ మూతపడి ఉందని, దానివల్లే స్టోరేజ్ ట్యాంకులో నిల్వ చేసిన ఒకటిన్నర మెట్రిక్ టన్నుల స్టైరీన్ లీక్ అయిందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ గ్యాస్ ప్రభావం కంపెనీ నుంచి అరకిలోమీటరు దూరంలో ఎక్కువగా ఉంటుందని, మూడు కిలోమీటర్ల పరిధి వరకు ఓ మోస్తరుగా ఉంటుందని చెబుతున్నారు. మరోసారి గ్యాస్ లీకయ్యే అవకాశం ఉందంటూ వస్తున్న వదంతులను కంపెనీ జీఎం తోసిపుచ్చారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకు కంపెనీ వైపు ఎవరూ రావొద్దని ఆయన స్పష్టంచేశారు.