స్పెషల్‌ : సీనయ్య ఈ ఏడాది లేనట్లేనా?

వివి వినాయక్‌ హీరోగా నరసింహ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించతలపెట్టిన చిత్రం సీనయ్య. ఈ చిత్రంతో వినాయక్‌ నటుడిగా సెటిల్‌ అవ్వొచ్చు అని అంతా అనుకున్నారు. దర్శకుడిగా హిట్స్‌ రాని ఈ సమయంలో ఖచ్చితంగా సీనయ్యతో వినాయక్‌ కు కొత్త ఇన్నింగ్స్‌ లభిస్తుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా సీనయ్య చిత్రం ఆరంభం నుండి అశుభాలనే ఎదుర్కొంటుంది. రెండు సార్లు షూటింగ్‌ అర్థాంతరంగా నిలిపేయడం జరిగింది.

స్క్రిప్ట్‌పై పూర్తిగా వర్క్‌ చేయకుండానే షూటింగ్‌కు వెళ్లడంతో మొదటి సారి సీనయ్య ఆగిపోయింది. రెండవ సారి స్క్రిప్ట్‌పై నమ్మకం లేదు అనే కారణంతో దిల్‌రాజు ఆపేశాడు అంటూ వార్తలు వచ్చాయి. ఏదోలా పూర్తి చేయాలని వినాయక్‌ పట్టుబట్టడంతో మళ్లీ సినిమాను మొదలు పెట్టారు. ఈ సమయంలోనే కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ను విధించారు. దాంతో షూటింగ్‌ మళ్లీ ప్రారంభం అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సీనయ్య చిత్రం మళ్లీ పట్టాలెక్కేది ఇప్పట్లో కాదంటున్నారు. దిల్‌రాజు ఆర్థికంగా తీవ్రమైన నష్టాలపాలయ్యాడు. నిర్మాతగా, థియేటర్ల అధినేతగా దిల్‌రాజు నష్టపోయాడు. ఇలాంటి సమయంలో సీనయ్య వంటి ప్రయోగాన్ని ఆయన అస్సలు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. వచ్చే ఏడాదికి దిల్‌రాజు మళ్లీ ఏమైనా ఆర్థికంగా గాడిలో పడితే సీనయ్యను పూర్తి చేయవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.