జయంతి మూవీస్… సినీ నిర్మాణంలో ఐదు దశాబ్దాల ఘన చరిత్రకు చేరువలో ఉన్న సంస్థ. ఈ నిర్మాణ సంస్థ అధినేత సి.అశ్వనీదత్. పాతతరం వాళ్లకి బాగా పరిచయం ఉన్న ఈ నిర్మాణ సంస్థ, దాని అధినేతను ఈ తరం వాళ్లకి కూడా దగ్గర చేస్తూ “మహానటి” సినిమా సంచలనాలు సృష్టించింది.
వైజయంతి మూవీస్ అంటే “జగదేకవీరుడు అతిలోక సుందరి” సినిమా గుర్తు రాక మానదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఆ సినిమా టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ సినిమా విడుదలై ఈ నెల 9వ తేదీకి 30 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత అశ్వనీదత్‌తో “ఈనాడు-ఈటీవీ” ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
విజయా ప్రొడక్షన్స్‌లాగా పెద్ద సినిమాలు తీయాలని చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినట్టు అశ్వనీదత్ తెలిపారు. అంతేకాదు, తీస్తే ఎన్టీఆర్ “జగదేకవీరుని కథ” లాంటి సినిమా తీయాలని బలంగా అనుకునేవాన్నని ఆయన తెలిపారు. సినీ ప్రస్థానంలో తన కల నేరవేర్చిన సినిమా “జగదేకవీరుడు అతిలోక సుందరి” అని ఆయన చెప్పుకొచ్చారు. “జగదేకవీరుడు అతిలోక సుందరి” సినిమా తనకొక మధురస్వప్నమన్నారాయన. వైజయంతీ సంస్థ గౌరవాన్ని ఆ సినిమా పెంచినట్టు అశ్వనీదత్ చెప్పారు.
ఈ 30 ఏళ్లే కాదు మరో 30 ఏళ్ల పాటు మాట్లాడుకునే సినిమా అది అన్నారాయన. తెలుగులో మొదటి 10 ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచి చరిత్ర సృష్టించిన సినిమాగా “జగదేకవీరుడు అతిలోక సుందరి” నిలిచిందని అశ్వనీదత్ గర్వంగా చెప్పారు.
తమ జగదేకవీరుడు మళ్లీ వస్తాడని అశ్వనీదత్ ప్రకటించారు. కచ్చితంగా ఆ సినిమా రెండో భాగం ఉంటుందన్నారాయన. రెండో భాగం తీసిన తర్వాతే తన రిటైర్‌మెంట్ ఉంటుందని అశ్వనీదత్ చెప్పి ఆశ్చర్యపరిచారు. అయితే ఆ సినిమా ఎప్పుడు, నటీనటులెవరనే విషయాలను తర్వాత చెబుతానన్నారు.
తమ దేవకన్య లేకపోవడం మనసు కలచివేస్తోందని అశ్వనీదత్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి చనిపోయాక ఆమెని చూడటానికి చిరుతో కలిసి ముంబయి వెళ్లినట్టు తెలిపారు. శ్రీదేవిని నిజంగానే దేవకన్యలా అలంకరించినట్టు ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ క్షణంలో తమ దేవకన్య ఇంద్రజ, తన పనులన్నీ పూర్తి చేసుకుని తండ్రి ఇంద్రుడి దగ్గరికి వెళ్లిపోయినట్టు అనిపించిందని ఆయన శ్రీదేవి జ్ఞాపకాల్లోకి వెళ్లారు.