చేతులెత్తేసిన వైసీపీ.. సవాళ్ళకిది సమయం కాదట

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీకి ఎదురే లేదు. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. 151 మంది ఎమ్మెల్యేలతో వైఎస్సార్సీపీ పటిష్టంగా వుంది. ఇతర పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు వైసీపీలో దాదాపుగా చేరిపోయినట్లే.. అధికారిక ‘చేరిక’ ఇంకా జరగాల్సి వుందంతే. ఈ తరుణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల బరిలో ఎవరైనా ధీటుగా ఎదుర్కొనే అవకాశముందా.? ప్రస్తుత రాజకీయ సమీకరణాల్ని చూస్తే ‘లేదు’ అనే సమాధానం చెప్పాలి. మరెందుకు భయం.? ఓ ఎంపీతోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా సవాళ్ళు చేసుకున్న దరిమిలా.. ‘ఆ ఘనకార్యం’ ఏదో చేసేస్తే పోలా.! కానీ, వైఎస్సార్సీపీ చేతులెత్తేసింది.

‘సవాళ్ళు చేసుకోవడం తగదు..’ అంటూ వైసీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకీ, ఇటు ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకూ ‘స్వీట్‌ వార్నింగ్‌’ ఇచ్చేశారు. ‘దీన్ని నోటీసుగానే పరిగణించి.. ప్రతి ఒక్కరూ తమ హద్దుల్లో వుండాలి’ అన్నట్లుగా ఉమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి.

రఘురామకృష్ణంరాజు, పార్టీ నిర్ణయాల్ని.. ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పు పడుతున్న దరిమిలా, ఆయనపై వేటు వేయాలన్నది వైసీపీలో కొందరి డిమాండ్‌. ఈ మేరకు రఘురామకృష్నంరాజు దిష్టిబొమ్మలూ తగలబడ్డాయ్‌ నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో చాలా చోట్ల. వైసీపీ ఎమ్మెల్యేల ఇసుక మేత సహా, వసూళ్ళ పర్వం గురించి రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. రఘురామకృష్ణంరాజుపైనా వైసీపీ నేతలు కొందరు తీవ్రమైన ఆరోపణలే చేశారు. అంటే, ఇక్కడ ‘అవినీతి’ సుస్పష్టం.

సవాళ్ళు వాళ్ళంతట వాళ్ళే విసురుకున్నారు గనుక.. ఇప్పుడు ప్రజలకు నిజాలు తెలియాలి. ఎవరి సత్తా ఏంటన్నది తేలిపోవాలి. కానీ, అంత ధైర్యం అధికార పార్టీకి ఎక్కడుంది.? రాష్ట్రంలో తమకు తిరుగే లేదని చెప్పుకుంటున్న వైసీపీ, ప్రజా క్షేత్రంలో ఇంకోసారి తన బలాన్ని నిరూపించుకునేందుకు అవకాశం ఏర్పడితే.. దాన్నెందుకు కాలదన్నేసుకుంటున్నట్లు.? గత కొద్దిరోజులుగా వైసీపీలో చోటు చేసుకుంటున్న ‘అంతఃపుర కలహాలను’ జాగ్రత్తగా గమనిస్తోన్న రాష్ట్ర ప్రజల ప్రశ్న ఇది.

‘దిష్టిబొమ్మలు తగలేస్తున్నారా.. మంచిదే, కాస్తంత గడ్డిని పశువులు తినడానికీ మిగల్చండి..’ అని రఘురామకృష్ణంరాజు తాజాగా వ్యాఖ్యానించారంటే.. రాష్ట్రంలో వైసీపీ తాజా పరిస్థితి ఏంటన్నది తెలిసిపోవడంలేదూ.!