ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు.. మొత్తంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకున్నారట. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన చేశారట. అయితే, పార్టీ ముఖ్య నేతలు వారించారట. లేకపోతే, పంచాయితీ ఎన్నికల రగడ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ‘శుభం కార్డు’ వేసి వుండేదేనంటూ వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు దర్శనమిస్తున్నాయి.
నిజమేనా ఇదంతా.? అంటే, అత్యంత వేగంగా సంక్షేమ పథకాల్ని అమలు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన అయితే వైఎస్ జగన్ చేస్తున్న మాట వాస్తవమేననీ, అయితే.. అది ఇప్పుడప్పుడే జరిగే అవకాశం లేదనీ ఇంకో వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేవలం సుప్రీంకోర్టు, ఎస్ఈసీ వ్యవహారంలో ప్రభుత్వానికి మొట్టికాయలేయడంతోనే వైఎస్ జగన్, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచన చేసి వుంటారని మాత్రం అనుకోలేం.
ఎందుకంటే వైఎస్ జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు కొత్తేమీ కాదు. చాలా విషయాల్లో పదే పదే జగన్ సర్కారుకి మొట్టికాయలు పడుతూనే వున్నాయి. ప్రతిసారీ విపక్షాలపైనా, న్యాయస్థానాలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, తమకు లేని సచ్ఛీలతను నిరూపించుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది తప్ప.. తమ వైఫల్యాల్ని ఒప్పుకునేందుకు సుముఖంగా లేదు. రాష్ట్రంలో ఎన్నికల సంస్కరణలంటూ, ఎస్ఈసీగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో మరో వ్యక్తిని నియమించింది గతంలో వైఎస్ జగన్ సర్కార్. హైకోర్టు ఆ ఆర్డినెన్సుని కొట్టివేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగిలిన అతి పెద్ద ఎదురు దెబ్బల్లో ఒకటి.
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు సహా చాలా అంశాల్లో ఇంతకు మించిన మొట్టికాయలు ఎదురయ్యాయి. ప్రతిసారీ ‘మేమే గొప్ప’ అనుకోవడం తప్ప, ‘అరే, ఇలా ఎదురు దెబ్బ తగిలిందేంటి.?’ అన్న కోణంలో ఆత్మవిమర్శ చేసుకున్నది లేదు. అలాంటప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం, పంచాయితీ ఎన్నికల ఎపిసోడ్‌లో ఎస్ఈసీ పై చేయి సాధించినంతమాత్రాన ‘రాజీనామా’, మద్యంతర ఆలోచనలు ఎలా చేస్తుందట.? ఛాన్సే లేదు.