‘పులివెందుల’కే మనోభావాలుంటాయా.? ‘నాయుడు’కి వుండవా.?

పులివెందుల గొప్పతనం గురించి తిరుపతి బహిరంగ సభలో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. అంత గొప్ప పులివెందులను.. ఇప్పుడు అగౌరవ పరిచే రీతిలో.. అక్కడి రాజకీయాల్ని జుగుప్సాకరంగా మార్చేశారన్నది జనసేన అధినేత ఆవేదన.

అయితే, పులివెందులలో కొందరికి, పవన్ కళ్యాణ్ మాటలు అర్థం కాలేదు. నిజంగానే అర్థం కాలేదో, అధికార పార్టీ తరఫునుంచి ఒత్తిళ్ళు వచ్చాయోగానీ.. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు పులివెందుల వాసులు పోలీసుల్ని ఆశ్రయించారు.

నిజానికి, పులివెందుల గురించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు పేరు ముందుంటుంది. ఏనాడూ చంద్రబాబు మీద ఇలాంటి కేసులు నమోదు కాలేదు.

సరే, ఆ సంగతి పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి, అధికార పార్టీకి చెందిన ఓ మంత్రిగారు ‘నాయుడు’ అంటూ, పవన్ కళ్యాణ్ పేరు చివరన లేని నాయుడిని తగిలించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ లెక్కన ‘నాయుడు’ అనే పేరున్నోళ్ళంతా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేయాలేమో.

అయినా, పోలీసులు.. అధికార పార్టీ నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తారు తప్ప, విపక్షాల నుంచి.. సామాన్యుల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించరనే అపప్రధ వుండనే వుంది. ఓ మాజీ మంత్రి.. మాజీ ఎంపీ.. అత్యంత కిరాతకంగా హత్యకు గురైంది పులివెందులలోనే. ఆ పులివెందుల నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పైగా, ఆ వివేకానందరెడ్డి, ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాబాయ్. ‘టీడీపీనే మా బాబాయ్ హత్యకు కారణం..’ అని ఇదే వైఎస్ జగన్ నినదించారు. ముఖ్యమంత్రి అయ్యాక.. దోషుల్ని పట్టుకోలేకపోయారు.

పులివెందులలో ఓ మాజీ ఎంపీ, ఓ మాజీ మంత్రికి న్యాయం జరగకపోవడం పులివెందుల ప్రజల మనోభావాల్ని దెబ్బతీయలేదంటారా.?