ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది. ఎవరు అధికారంలో వున్నాసరే, ఇంకొకరు పోలీసు వ్యవస్థ మీద తమకు నమ్మకం లేదని అంటున్నారు. 2014 నుంచి 2019 వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వున్నారు.. ఆ సమయంలో, వీలు చిక్కినప్పుడల్లా పోలీసు వ్యవస్థ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. ‘ఆంధ్రపదేశ్ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు’ అని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
అది వైఎస్ జగన్ మీద విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగినప్పుడు కావొచ్చు.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైనప్పుడు కావొచ్చు.. వైసీపీ నేతలంతా ఏపీ పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడిన వైనాన్ని ఎలా మర్చిపోగలం.? ఇప్పుడు వైసీపీ అధికారంలో వుంది.. టీడీపీ సహా వివిధ రాజకీయ పార్టీలు (విపక్షాలు), ఆంధ్రపదేశ్ పోలీసులపై తీవ్రస్థాయి విమర్శలు చేస్తుండడం చూస్తున్నాం.
విశాఖ విమానాశ్రయంలో తన మీద దాడి జరిగితే, తెలంగాణలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు వైఎస్ జగన్. ఏం, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో మెరుగైన ఆసుపత్రులే అప్పట్లో లేవా.? ఇక, ఇప్పుడు రఘురామకృష్ణరాజు, ఆంధ్రపదేశ్ పోలీసుల పట్లే కాదు.. ఆంధ్రపదేశ్ ప్రభుత్వ వైద్యుల పట్ల కూడా తనకు నమ్మకం లేదని అంటున్నారు. ఆయన్ని సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏకంగా ఆర్మీ ఆసుపత్రికి.. అందునా తెలంగాణలో వున్న ఆర్మీ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
నడుస్తున్న రాజకీయాలపై ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి.. ఆయా వ్యవస్థల్లో వున్నవారూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. పనిచేసేది అప్పుడూ, ఇప్పుడూ ఆ పోలీసులే. వారి వారి పదవులు అటూ ఇటూ అవుతాయంతే. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావుపైన వైఎస్ జగన్ ప్రభుత్వం రకరకాల అభియోగాలు మోపి, ఆయన్ని ఉద్యోగం నుంచి దూరం చేసింది.
రేప్పొద్దున్న అధికారంలోకి ఇంకో పార్టీ వస్తే.. అప్పుడూ మార్పులు తప్పవు. అప్పుడూ.. ఏపీ పోలీసుల మీద ఇలాంటి విమర్శలే రావడం సహజాతి సహజం.. అని సరిపెట్టుకోవడమేనా.? వ్యవస్థల్లో మార్పు వస్తుందా.? వేచి చూడాల్సిందే.