దేశంలోనే కరోనా వైరస్ కట్టడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో వుంది.. రికవరీల పరంగా ది బెస్ట్.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో రికార్డ్.. కరోనా టెస్టుల్లో మేటి.. వైద్య సౌకర్యాల కల్పనలో అత్యద్భుతం.. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నడుపుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్న ప్రచారం అంతా ఇంతా కాదు.
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో 40 వేల నుంచి 50 వేల కేసులు రోజువారీగా నమోదైన సందర్భాలున్నాయి. ఆ స్థాయి నుంచి 2 వేల దిగువకు రోజువారీ కేసులు వచ్చాయిప్పుడు. అక్కడ లక్షకు పైగా టెస్టులు ప్రతిరోజూ జరుగుతున్నాయి. మరి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి.? రెండు వేల ఐదు వందల మార్కుకి అటూ ఇటూగా కరోనా పాజిటివ్ కేసులు రోజువారీగా వెలుగు చూస్తున్నాయి. టెస్టుల సంఖ్య 80 నుంచి 90 వేల మధ్య దోబూచులాడుతున్నాయి.
అసలేమవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? పొరుగు రాష్ట్రం తెలంగాణలో వెయ్యి లోపే రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిజానికి, తెలంగాణకి విశ్వ నగరం హైద్రాబాద్ రాజధానిగా వుంది. కానీ, హైద్రాబాద్ కరోనా కట్టడి విషయంలో చాలా పద్ధతిగా వుందనే చెప్పాలి. పైగా, తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తేశారు. అయినా, కరోనా అదుపులోనే వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.. కానీ, కేసులు తగ్గడంలేదు. ఇది సర్కార్ వైఫల్యంగానే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టెస్టింగ్, ట్రేసింగ్ విధానంలో వైఫల్యాలే రాష్ట్రానికి శాపంగా మారుతోందన్న విమర్శ వుంది. మీడియాకెక్కి ప్రచారం చేసుకోవాలన్న యావ తప్పితే, ప్రజారోగ్యంపై కనీస బాధ్యత అధికార పార్టీలో లేదన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. రాజకీయ ప్రత్యర్థులపై వింత వింత కేసులు ఎలా బనాయించాలి.? ఇతర పార్టీలకు చెందిన నేతల్ని ఇలా తమవైపుకు తిప్పుకోవాలి.? లాంటి ఆలోచనలు తప్ప, ప్రజల్ని కరోనా బారి నుంచి ఎలా కాపాడాలన్న కనీసపాటి బాధ్యత ప్రభుత్వానికి లేకుండా పోయిందనే ఆవేదన రాష్ట్ర ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.
ప్రజలెక్కడైనా ఒకేలా వుంటారు.. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నారు.. తెలంగాణలోని వారూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నారు.. కర్నాటక, తమిళనాడు సంగతి సరే సరి.. అయినాగానీ, పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ కరోనా విషయంలో కొత్త ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్నది నిర్వివాదాంశం. ప్రజలు బాధ్యతగా వ్యవహరించడంలేదని చెబుతూ జగన్ ప్రభుత్వం తన బాధ్యతల్ని విస్మరిస్తే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
Share