జగన్ సారూ.. కాస్త తెలంగాణ వైపూ చూడాలె.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పొరుగు రాష్ట్రం ఒడిషా (ఒరిస్సా)తో వున్న సంబంధాల్ని మరింత బలపర్చుకునేందుకు, అలాగే ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారం కోసం.. ఒడిషా వెళ్ళారు.. ఒడిషా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలూ సంయుక్తంగా కమిటీ వేసి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయన్నది ఇరువురు ముఖ్యమంత్రులు చేసిన ప్రకటన సారాంశం.

అంతా బాగానే వుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ, సరిహద్దు గ్రామాల విషయంలోనూ, ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ ఒడిషాతో ఆంధ్రప్రదేశ్ సఖ్యంగా వుండాల్సిందే. మరి, తెలంగాణ సంగతేంటి.. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య ఇటీవల నీటి వివాదాలు తలెత్తాయి.. విద్యుత్ వివాదాలూ షురూ అయ్యాయి. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది.

మరి, తెలంగాణ వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు స్నేహహస్తం చాచలేకపోతున్నారు.? ఒడిషా కంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ చాలా దగ్గర. ఎందుకంటే, సొంత నివాసం తెలంగాణలో వుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.

గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘దోస్తీ’ కట్టారు. ఇరువురూ ఇరు రాష్ట్రాల మధ్యా నీటి సమస్యలపై చర్చించారు కూడా. కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి.

ఒకరి ప్రాజెక్టులపై ఇంకొకరు ఆరోపణలు చేసుకోవడమూ చూస్తున్నాం. మరి, ఈ సమస్యల పరిష్కారం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు ప్రయత్నించడంలేదన్న చర్చ సహజంగానే జరుగుతుంది. తెలంగాణలో తన సోదరి షర్మిల పెట్టిన పార్టీ విషయమై వైఎస్ జగన్ ఒకింత ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు, కేసీయార్ – జగన్ మధ్య ‘ఇగో సమస్యలు’ వచ్చాయన్న ప్రచారమూ వుంది.

ఒడిషా వెళ్ళొచ్చాం.. సమస్యలు పరిష్కరించేశాం.. అని చెప్పుకుంటున్న వైసీపీ, తెలంగాణ విషయంలో మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం.