జగన్ పై ఐఏఎస్ లు ఫైర్

తాను తలచింది జరగాలి అనుకునే మనిషి ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్. ముఖ్యంగా తన కోర్ టీంను అతనకు అనుగుణంగా మార్చుకునే క్రమంలో ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకి అతని కంటే కింద పోస్టులో ఉన్న వ్యక్తి ద్వారా నోటీసు ఇచ్చి అర్ధంతరంగా తొలగించడం, ఐఆర్ఎస్ అధికారి క్రిష్ణ కిషోర్ కు జీతం ఆపి అతనిని సస్పెండ్ చేయడం, ఏకంగా రాజధానే మార్చాలనుకోవడం ఇలాంటి ఎన్నో సంచలన వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు.

తాజాగా ఏకంగా తన పరిధిలో లేని ఎన్నికల కమిషనర్ తప్పించడానికి ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారాన్ని వినియోగించారు. అయితే… ఎన్నికల కమిషనర్ మార్పుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టడమే కాదు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం నిలబడదు అంటున్నారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిలో భారత మాజీ ఎన్నికల కమిషనర్ కూడా ఉన్నారు.

జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అవుతుందని కేంద్రం ఎన్నికల సంఘం మాజీ సీఈసీ డాక్టర్ ఎస్ వై ఖురేషీ మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ అన్నది పూర్తిగా పాలనా పరమైన వ్యవహారమని, మన దేశంలోని ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సంఘం విధులు అత్యున్నతమైనవి అని అన్నారు. పలువురు ప్రపంచ ప్రముఖులు కీర్తించారన్నారు. హిల్లరీ క్లింటన్ కూడా మన ఎన్నికల ప్రక్రియను కీర్తించారని ఆయన గుర్తుచేశారు.

అర్ధాంతరంగా ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, గతంలో ఉన్నవారికంటే రాబోయేవారు పవిత్రమైన వారు అనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోందని ఐఏఎస్ అధికారుల సంఘం అభిప్రాయపడింది.

ఇంతవరకు ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగ బద్ద సంస్థ అని… దానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులనే నియమిస్తారని… ఇలా రిటైర్డ్ జడ్జిని నియమించడం ఇదే తొలిసారి అని… కోర్టులో ఈ నియమాకం నిలబడదు అని వ్యాఖ్యానించింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ అని, రాజ్యాంగంలోని 243 K ఆర్టికల్ ప్రకారం ఈ స్వతంత్ర ప్రతిపత్తి సంక్రమిస్తుందని…దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభావితం చేయలేవని పేర్కొంది. ఇష్టం వచ్చిన విధంగా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లను మార్చే అధికారం ఉంటే… రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తికి ఇక అర్థం లేదని మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

అంత శక్తి, అవకాశం ఉంటే… పంచాయతీ రాజ్ శాఖ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేవారు అని, ఎన్నికల సంఘం అవసరం ఉండేది కాదన్నారు. తాజా ఆర్డినెన్స్ పై రమేష్ కుమార్ కోర్టును ఆశ్రయించబోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా, కరోనా విపత్తు సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న జగన్ కు కోర్టులో మరోసారి తలనొప్పులు తప్పవనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.