సలహాదారుకే సలహాదారు.. ఇది కూడా ’ఆ కోటా‘లోనేనా.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతున్నాయన్న విమర్శ ఈనాటిది కాదు. తెలంగాణలోగానీ, దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లోగానీ ఈ ‘కుల’ పైత్యం కన్పించదు. చంద్రబాబు హయాంలో ‘కమ్మ’గా పదవుల పంపకం జరిగింది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో ‘రెడ్డి’ పంపకాలు జరుగుతున్నాయి. తాజాగా, మరో ‘రెడ్డి’కి సలహాదారుగా అవకాశం వరించింది. ఈసారి సలహాదారుకే సలహాదారు పదవిని సృష్టించారు. నాన్‌ రెసిడెంట్‌ తెలుగు ఎఫైర్స్‌ ఇన్‌క్లూడింగ్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్స్‌ డిప్యూటీ అడ్వయిజర్‌గా పెద్దమల్లు చంద్రహాస రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

రెండేళ్ళపాటు ఈయన ఈ పదవిలో వుంటారు. ఇందు కోసం ఆయనకు నెలకు 2 లక్షల రూపాయల వేతనం అందిస్తారు. పర్సనల్‌ స్టాఫ్‌ అలవెన్స్‌ కింద 70 వేల రూపాయలు, వాహనం నిమిత్తం 60,000 రూపాయలు, మొబైల్‌ ఫోన్‌ డేటా కోసం 2,000 రూపాయలు, అకామడేషన్‌ నిమిత్తం 50,000 రూపాయలు చెల్లించనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌ కూడా వర్తిస్తుంది. ట్రావెల్‌ వ్యవహారాలకు సంబంధించి డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ విమానాల్లో ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ప్రభుత్వానికి సలహాదారులు అవసరమే. అయితే, ‘సామాజిక వర్గం’ అదనపు క్వాలిఫికేషన్‌గా ఈ పదవుల కోసం ఉపయోగపడ్తుండడమే ఆక్షేపణీయం. విపక్షాలు ఈ దిశగా ఎన్ని విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.

ఇప్పటికే ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా సలహాదారులున్నారు. ఓ పక్క కరోనా తెచ్చిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో, కొత్తగా సలహాదారుల నియామకం ఎంతవరకు సబబు.? అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. ఎవరేమనుకున్నా డోన్ట్‌ కేర్‌.. సలహాదారుల సంఘంలో ముందు ముందు మరింత మంది చేరబోతున్నారని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. సలహాదారులకు మళ్ళీ ఉప సలహాదారులు.. వారికి మళ్ళీ సహాయ ఉప సలహాదారులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. జనానికేమో పప్పు బెల్లం.. అయినవారికేమో.. అగ్ర తాంబూలం.. అన్నట్టుంది వ్యవహారం.