రెండో రోజు కొనసాగుతున్న సీఎం జగన్ ఢిల్లీ టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన ప్రధాని మోదీని, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియాలను కలిసి రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని రహదారులు, జాతీయ రహదారుల విస్తరణ, సముద్ర తీరం వెంబడి ఫోర్ లైన్ల రహదారుల నిర్మాణం, విశాఖ-భోగాపురం జాతీయ రహదారి నిర్మాణం, విజయవాడ తూర్పు హైవేతోపాటు పెండింగ్ ప్రాజెక్టుల అంశాలను చర్చించారు. అనంతరం హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు.

నిన్న ప్రధానితో జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన 8 అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్ర విభజన సందర్బంగా ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల్లో చాలా వరకూ నెరవేర్చలేదని.. సత్వరం పరిష్కరించి ఆదుకోవాలని కోరారు.