మధ్యతరగతి వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ పథకానికి సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా మధ్యతరగతి వారికి సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేస్తోందని.. మూడు కేటగిరీల్లో ఈ స్థలాల పంపిణీ జరుగుతుందన్నారు.
ఎంఐజీ-1లో 150 గజాలు, ఎంఐజీ-2లో 200 గజాలు, ఎంఐజీ-3లో 240 గజాలు అందిస్తామని అన్నారు. తొలిదశలో గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, కడప జిల్లాలోని రాయచోటి, ప్రకాశం జిల్లాలోని కందుకూరు, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు లేఅవుట్లు అమలు చేస్తామన్నారు. నేటి నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని.. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికీ ఈ పథకం వర్తింపజేస్తామని అన్నారు.