భూముల అమ్మకం.. జగన్‌ సర్కార్‌కి బిగ్గెస్ట్‌ డ్యామేజ్‌.!

ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణ ఆర్థికంగా ఎంతో ముందున్న రాష్ట్రం. ఆ మాటకొస్తే, తెలంగాణని ధనిక రాష్ట్రంగా అభివర్ణిస్తుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. అది నిజం కూడా. కానీ, తెలంగాణ కూడా ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా భూముల అమ్మకాల్ని చేపడుతుండడం చూస్తున్నాం. ఏ ప్రభుత్వ హయాంలో అయినా ఇలాంటివి సహజమే. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు వేరు. ‘భూముల అమ్మకం’ చుట్టూ నానా యాగీ జరుగుతోంది. ఆ భూముల అమ్మకం జరగకపోతే, జగనన్న నవరత్నాలు అమలయ్యే పరిస్థితి లేదని అధికార పార్టీ చేతులెత్తేయడమే అందుక్కారణం. ‘

ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకే భూముల అమ్మకం.. ఇందులో తప్పేముంది.?’ అని మంత్రిగారు బుకాయించే ప్రయత్నం చేసినా, భూములు ఇంకా అమ్మకముందే అధికార పార్టీకి పొలిటికల్‌గా చాలా డ్యామేజీ జరిగిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం కోసం భూముల్ని సమీకరిస్తే.. అప్పటి ప్రతిపక్షం నానా యాగీ చేసింది. ఆయా సంస్థలకు భూ కేటాయింపులు జరిపితే, అడ్డగోలు ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల్లో నిజమెంత.? అన్నది ఇప్పటికీ తేలలేదనుకోండి.. అది వేరే సంగతి.

‘అప్పుడు చంద్రబాబు మీద బురద చల్లారు.. ఇప్పుడు మీరేం చేస్తున్నారు.? అయినా, పబ్లిసిటీ పథకాలకి ప్రభుత్వ భూముల్ని అమ్మేయడమేంటి.?’ అని జనం నిలదీసే పరిస్థితి వచ్చిందిప్పుడు. తాజాగా, రాజమండ్రి సెంట్రల్‌ జైలు భూముల్ని కూడా ప్రభుత్వం అమ్మేయబోతోందన్న ప్రచారంతో మరింత అలజడి రేగింది.

తూర్పుగోదావరి జిల్లాలో ‘అధికార పార్టీ భూమాయ’ అంటూ ఇప్పటికే నానా యాగీ జరుగుతోంది. పేదలకు ఇళ్ళ స్థలాల కోసం సేకరిస్తోన్న భూముల్లో 400 కోట్లు చేతులు మారాయన్నది ప్రతిపక్షం టీడీపీ చేస్తోన్న ఆరోపణ. ఇంతలోనే ఇప్పుడు జైలు భూముల అమ్మకం వ్యవహారంపై అందుతున్న లీకులతో దుమారం మరింతగా పెరుగుతోంది. ఈ లెక్కన ప్రభుత్వం, భూముల్ని అమ్మితే తప్ప మనుగడ సాధించలేదా.? అన్న అనుమానం సగటు ప్రజానీకానికి కలగడం సహజమే.

ఏడాది తిరగకుండానే ప్రభుత్వంపై ఈ స్థాయిలో ప్రజలకు అనుమానాలు కలగడమంటే.. జగన్‌ ఫెయిల్డ్‌ సీఎం.. అంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారానికి బలం చేకూరినట్లే కదా.!