ఎవర్ని మంత్రులుగా నియమించుకోవాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం. మంత్రి వర్గంలో ఎవర్ని కొనసాగించాలన్నది కూడా ముఖ్యమంత్రి ఇష్టమే. ఈ విషయంలో వివాదానికి ఆస్కారమే లేదు. కానీ, రెండున్నరేళ్ళు కొందరికి, ఆ తర్వాత రెండున్నరేళ్ళు మరికొందరికి.. అంటూ ఈ పదవుల పంపకాలేంటి.? ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశాక, మంత్రుల ఎంపిక విషయమై ఆయన తెరపైకి తెచ్చిన ‘చెరిసగం’ వ్యూహం అప్పట్లోనే అనేక విమర్శలకు తావిచ్చింది.
బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చాక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అడ్డుతగిలేదెవరు.? అడ్డగోలుగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటేనే, అది తప్పని తెలిసినా అభ్యంతరం వ్యక్తం చేయలేని, తమ వాదన బలంగా వినిపించలేని ఘనులు వైఎస్ జగన్ మంత్రి వర్గంలో వున్నారాయె.
‘జీ హుజూర్’ అనడం తప్ప, ఎదురు తిరిగే ఆస్కారమే లేని వారిని మంత్రులుగా పెట్టుకున్నారు వైఎస్ జగన్. అందుకే, వాళ్ళని మాజీల్ని చేసే దిశగా వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నా, పైకి గట్టిగా ‘నిరసన గళం’ విప్పలేని నిస్సహాయత వాళ్ళందరిదీ.
గడచిన మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శూన్యం.. అప్పులు ఘనం. వివాదాలు కోకొల్లలు. కోర్టుల మొట్టికాయలు, కుప్పలు తెప్పలుగా మాట తప్పడాలు, మడమ తిప్పడాలు.. వెరసి, అన్నిటా వ్యతిరేకతే. ఇంతటి వ్యతిరేకత నడుమ పాత మంత్రులకు గుడ్ బై చెప్పి, కొత్త మంత్రుల్ని క్యాబినెట్‌లోకి తీసుకున్నాక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకెంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందో ఏమో.!
కొత్తగా మాజీలయ్యేవారి అసంతృప్తి వైసీపీని ఏం చేస్తుందన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ‘సమర్థతను చూడకుండా, అసమర్థులమన్నట్టుగా ముద్ర వేసేసి తొలగించడం తగదు..’ అంటూ పలువురు సీనియర్ మంత్రులు, తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. పదవులు నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా అధినేత భజన చేసిన సదరు మంత్రులు, ఇప్పుడు ఉస్సూరుమనాల్సిన పరిస్థితి. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.!