వైభవంగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవానికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆల‌యానికి చేరుకున్న ముఖ్యమంత్రికి టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగ‌తం ప‌లికారు.

అర్చకులు ముఖ్యమంత్రికి తలపాగా కట్టి పళ్లెం లో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. వీటిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆలయంలో అర్చకులకు అందించారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు సీఎంకు శేష‌వ‌స్త్రం అందించి వేదాశీర్వచ‌నం చేశారు. అనంతరం సిఎంకు స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాముల‌వారి చిత్రప‌టం అంద‌జేశారు.

ఒంటిమిట్ట కోదండరాముడికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు పట్టువస్త్రాలు పంపించారు. గవర్నర్ తరపున రాజ్ భవన్ అధికారులు స్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు పంపించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లిఖార్జున రెడ్డి, రవీంద్రనాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు ఉన్నారు.