సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్, మిగతా రాష్ట్రాలతో పోల్చితే ముందంజలో వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. విభజన నేపథ్యంలో ఏర్పడ్డ కష్టాలు సహా అనేక ఇబ్బందులు రాష్ట్రాన్ని వెంటాడుతున్న విషయం విదితమే. అయితే, చంద్రబాబు హయాంలోనూ సంక్షేమ పథకాలకు లోటు లేదు.. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలోనూ అదే పరిస్థితి.
చంద్రబాబుతో పోల్చితే తాను మరింత గొప్ప.. అన్పించుకోవడానికి వైఎస్ జగన్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అధికారంలోకి వస్తూనే, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఓ పద్ధతి ప్రకారం సరికొత్త సంక్షేమ పథకాల్ని అమలు చేయడం మొదలు పెట్టారు. నవరత్నాలకు అదనంగా కొన్ని కొత్త పథకాల్నీ తెరపైకి తెచ్చారు. వీటన్నిటికోసం ఎప్పటికప్పుడు క్యాలెండర్ సిద్ధం చేసుకుంటున్నారు.
తాజాగా 2020కి సంబంధించి రానున్న నెలల్లో ఏయే కొత్త సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించాలి.. అన్న విషయమై ఓ క్యాలెండర్‌ని విడుదల చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ విద్యా దీవెన.. ఇలాచెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలే వున్నాయి. రైతులకు వడ్డీ లేని రుణాలు, అంబులెన్స్‌ల ప్రారంభం, వైఎస్సార్ హౌసింగ్ పేరుతో సుమారు 15 లక్షల ఇళ్ళ నిర్మాణం, ప్రతి రైతు కుటుంబానికి 4 వేలు, అర్చకులు, పాస్టర్లు, మౌజమ్ లకు 5 వేలు చొప్పున సాయం.. ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ క్యాలెండర్‌లో పొందుపర్చారు.
వీటిల్లో పేదలకు ఇళ్ళ స్థలాల వ్యవహారం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఉగాది పండక్కి ఇళ్ళ స్థలాలు ఇస్తాం.. అని చెప్పిన ప్రభుత్వం, దాన్ని జులై 8వ తేదీకి వాయిదా వేసిన విషయం విదితమే. మొత్తమ్మీద, సంక్షేమ పథకాలు చూస్తే అదరహో.. అనే స్థాయిలో వున్నాయన్నది నిర్వివాదాంశం. కానీ, వీటన్నిటికీ నిధులు ఎలా.? ఇప్పటికే వేల కోట్ల అప్పుల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం చేసేసిందంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అభివృద్ధి అన్న ఆలోచనే ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నది విపక్షాల ఆరోపణ.
పోలవరం ప్రాజెక్ట్ సహా.. అనేక విషయాల్లో రివర్స్ టెండరింగ్‌లు రాష్ట్రానికి చేటు చేస్తున్నాయంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. అప్పులు చేసి, సంక్షేమ పథకాలు చేపడితే.. ముందు ముందు అప్పులు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడుతుందన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వం మాత్రం, ఎలాగైతే సంక్షేమ పథకాల కోసం క్యాలెండర్ సిద్ధం చేసుకున్నామో, అభివృద్ధి కార్యక్రమాలకీ అలాగే తమ దగ్గర ప్రణాళిక వుందని అంటోంది.