టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సర్వ సన్నద్ధమయ్యిందట. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌, ఏలూరు సాంబశివరావు, ఏ క్షణాన అయినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ అయి పార్టీ కండువా కప్పుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. గొట్టిపాటి రవికి చెందిన గ్రానైట్‌ క్వారీల విషయంలో ఈ మధ్య సమస్యలు ఎక్కువయ్యాయనీ, అవన్నీ అధికార పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా కల్పించిన ఇబ్బందులనీ, వాటి నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేక గొట్టిపాటి రవి వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారట.

ఇదిలా వుంటే, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్‌, మద్దాలి గిరి ఇప్పటికే టీడీపీని వీడారు. మొత్తంగా చూస్తే టీడీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే వ్యూహంతో వైసీపీ అధిష్టానం పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే, టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి షరతు విధించారట.

మరోపక్క, టీడీపీ అసంతృప్త ఎమ్మెల్యేలంతా గ్రూపుగా ఏర్పడి, స్పీకర్‌ వద్దకు వెళ్ళనున్నారనీ, తమను ప్రత్యేక గ్రూపు కింద అసెంబ్లీలో పరిగణించాలని స్పీకర్‌ని కోరనున్నారనీ, అలా చేసేత అనర్హత వేటు తప్పించుకోవచ్చన్న కోణంలోనే ఎమ్మెల్యేలంతా వ్యూహ రచన చేస్తున్నారనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం విదితమే. ముగ్గురు ఎంపీలుగా విజయం సాధించారు. అయితే, ఆ ముగ్గురిలోనూ ఇద్దరు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌ కూడా పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో వున్నారనే ప్రచారం గత కొన్నాళ్ళుగా జరుగుతోంది.