ఎస్ఈసీ విషయంలో సర్కారు తదుపరి స్టెప్ ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం ఏ మలుపు తిరగబోతోంది? న్యాయస్థానంలో పైచేయి ఎవరికి కాబోతోంది? ఒకవేళ హైకోర్టులో సర్కారుకు ఎదురుదెబ్బ తగిలితే సర్కారు తదుపరి చర్య ఏమిటి? ప్రస్తుతం ఈ అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని కుదిపేస్తున్నా.. రాజకీయపరమైన ఈ అంశానికి ఎనలేని ప్రాధాన్యత లభిస్తోంది.

ఏపీ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగించి ఆ స్థానంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో తన తొలగింపును సవాల్ చేస్తూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేసినందుకే తనను టార్గెట్ చేశారని, వెంటనే తనన తొలగించడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కోరారు.

దీనిపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. సోమవారం తుది విచారణ జరుపుతామని పేర్కొంది. దీంతో తదుపరి ఏం జరగబోతోందని అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ సర్కారు పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణ తదుపరి నియామకాలకు వర్తిస్తుందని, ఐదేళ్ల కాలానికి 2016లో నియమితులైన నిమ్మగడ్డకు ఇది వర్తించదని కొందరు వాదిస్తున్నారు.

ఒకవేళ హైకోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తే.. ప్రభుత్వం వద్ద ప్లాన్ బి కూడా రెడీగా ఉందని సమాచారం. గతంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ గా టీఎన్ శేషన్ విషయంలో పీవీ సర్కారు అనుసరించిన వైఖరినే ఏపీ ప్రభుత్వం అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అప్పట్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన శేషన్ కు చెక్ చెప్పేందుకు పీవీ నరసింహారావు మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు. దీంతో ఏ కీలక నిర్ణయమైన మెజార్టీ కమిషనర్ల మాటకే ఆమోదం లభించేంది. సహజంగానే ఆ ఇద్దరూ సర్కారుకు అనుకూలంగా ఉండటంతో శేషన్ మాట చెల్లుబాటు కాలేదు.

సరిగ్గా ఇదే తరహాలో ఏపీలో కూడా మరో ఇద్దరు కమిషనర్లను నియమించే అవకాశం ఉంది. నిజానికి తొలుత నిమ్మగడ్డకు చెక్ చెప్పడానికి ఇదే ఫార్ములా అనుసరించాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, చివరి క్షణంలో అనూహ్యంగా పదవీకాలం కుదింపు ద్వారా నిమ్మగడ్డను తొలగించారు.