నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న కీలక నిర్ణయాలన్నీ ఆయనకు వ్యతిరేకంగానే మారిపోతున్నాయి. ఇప్పటికే రాజధాని తరలింపు, కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయం తరలింపు, స్థానిక సంస్థల ఎన్నికలపై వరుస దెబ్బలు తిన్న జగన్ సర్కారు… తాజాగా సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమం విషయంలోనూ ఎదురుదెబ్బ తిన్నది. ఈ మేరకు బుధవారం సర్కారీ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడానికి సంబంధించిన సర్కారీ ఉత్వర్వులపై దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సదరు జీవోను కొట్టివేసింది.
గత టీడీపీ ప్రభుత్వం కూడా సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమం అంటూ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఇప్పుడు జగన్ సర్కారు వ్యవహరిస్తున్న స్పీడులో మాత్రం వెళ్లలేదు. ముందుగా మునిసిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టి, ఆ తర్వాత మిగిలిన సర్కారీ స్కూళ్లలో ప్రవేశం దిశగా టీడీపీ సర్కారు సాగింది. అయితే అందుకు భిన్నంగా సాగిన జగన్ సర్కారు… అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం అంటూ దూకుడు ప్రదర్శించింది. దీనిపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున రచ్చ జరిగిన సంగతీ తెలిసిందే.
అయితే ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాద్యమం అంటూ .జగన్ సర్కారు తనదైన స్పీడులో జీవోలను విడుల చేస్తే… వాటిపై తెలుగు భాషాభిమానులతో పాటు విపక్షాలకు చెందిన వారు కూడా హైకోర్టు గడప తొక్కారు. ఈ క్రమంలో ఆంగ్ల మాద్యమం జీవోలపై తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా వేచి చూడాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను పాటిస్తున్నట్లుగానే వ్యవహరించిన జగన్ సర్కారు… సర్కారు బడుల్లో ఆంగ్ల మాద్యమం ప్రవేశానికి సంబంధించి వేగంగా చర్యలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో ఏ మాధ్యమంలో చదవాలన్న అంశం విద్యార్థుల నిర్ణయానికి వదిలేయాలని ఓ పిటిషనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సదరు పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు… ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో జగన్ సర్కారుకు వరుసగా మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు.