సుప్రీం ఉవాచ: మాతృ భాషలో విద్యాబోధనే మేలు.!

‘ప్రైవేటు స్కూళ్ళలో ఫీజులు సామాన్యులకు భారంగా మారుతున్నాయి.. అందుకే, పేదలకు కూడా ఇంగ్లీషు మీడియం అందుబాటులోకి తెస్తున్నాం. మండలానికి ఓ స్కూల్‌లో తెలుగు మీడియం బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం..’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి ‘మీడియం’ అంశాన్ని తీసుకెళ్ళింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

తెలుగు మీడియంని పాతాళంలోకి తొక్కేసి, ఇంగ్లీషు మీడియంను ఆగ్ర పథాన నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతుండగా, దానికి ఏపీ హైకోర్టు బ్రేకులు వేసిన విషయం విదితమే. నిజానికి, ఇంగ్లీషులో విద్యా బోధన అనేది కొత్త విషయమేమీ కాదు. గతంలో.. చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియంని తీసుకొచ్చింది. కానీ, జగన్‌ ప్రభుత్వం మొత్తంగా తెలుగు మీడియంని దూరం చేయాలనే ‘దురాలోచన’ చేసింది. అదే అసలు సమస్య.

తమ వాదనను మరింత గట్టిగా వినిపించేందుకోసం కరోనా సమయంలో ‘విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ్‌’ అంటూ చిత్ర విచిత్రమైన ప్రస్తావన తీసుకొచ్చి, ఏకంగా 96 శాతం మంది ఇంగ్లీషు మీడియంకి అనుకూలం.. అనే నివేదికను రూపొందించి, సుప్రీంకోర్టుకూ నివేదించింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. అయితే, ఈ నివేదికల ఆధారంగా మీడియం విషయమై నిర్ణయాలు తీసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.

పైగా, ప్రాథమిక విద్య అనేది మాతృ భాషలోనే వుండాలనీ.. అలా వున్నప్పుడే, ఇంగ్లీషు లాంటి భాషల్ని నేర్చుకోవడం, ఆ మాధ్యమంలో రాణించడం సులభతరమవుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేసు విచారణను వచ్చేవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేయడానికి నిరాకరించడం గమనార్హం.

హైకోర్టు తీర్పుపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన ‘బ్లూ బ్యాచ్‌’ ఇప్పుడు సుప్రీంకోర్టు మీదా అదే తరహా వ్యాఖ్యలు చేసేందుకు సాహసిస్తారా.? అన్నది వేచి చూడాలి. కేంద్రం కొత్త విద్యా విధానం ప్రకటించిన తర్వాత కూడా ఇంకా మాధ్యమం పేరుతో వైసీపీ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది.