కరోనాపై జగన్‌ ప్రసంగం.. ఇంత చప్పగానా.!

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ని సాధారణ జ్వరంగా ఇంకోసారి తేల్చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ‘కరోనా వైరస్‌తో మనం కొన్నాళ్ళు జీవించాల్సి వస్తుంది..’ అనే మాట నిజమే అయినా, ఆ విషయం చెప్పే క్రమంలో ముఖ్యమంత్రిలో సీరియస్‌నెస్‌ కన్పించకపోతే, సాధారణ ప్రజానీకానికి తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా వుంటాయా.? ‘సాధారణ జ్వరం’ అనే మాట నిజంగానే తప్పుడు సంకేతాల్ని పంపుతోంది జనంలోకి. అదే, ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ని జనం సీరియస్‌గా తీసుకోకపోవడానికి కారణమన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఇంకోపక్క, రికార్డు స్థాయిలో టెస్టులు చేసేశామంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పదే పదే తన ‘ఘనతను’ చాటుకునే ప్రయత్నం చేయడం హాస్యాస్పదమే. 10 లక్షల మందికి సుమారు 1300 పరీక్షలు చేయడమంటే.. నిజంగానే సిగ్గుపడాల్సిన విషయం. రాష్ట్రం వరకూ ఇది పెద్ద సంఖ్యే కావొచ్చుగాక.. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు. కానీ, 10 లక్షల మందిలో 1300 మందికి కరోనా పరీక్షలంటే.. అది ఎంత హాస్యాస్పదం.? ఇక్కడ తగిన వనరులు లేవన్నది నిర్వివాదాంశం. అలాంటప్పుడు ఆ చిన్న ఫిగర్‌ని పదే పదే ఘనతగా చెప్పుకోవడం అస్సలేమాత్రం సబబు కాదు.

కరోనా వైరస్‌ని మహమ్మారిగా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించాక.. దాన్ని ‘చిన్న జ్వరం లాంటిది’ అని ఓ ముఖ్యమంత్రి ఎలా అనగలుగుతారు.? కరోనా వైరస్‌ దెబ్బకి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో మరణాల సంఖ్య ఇంకా పెరగబోతోంది. ఆర్థికంగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల్ని మరింత అప్రమత్తం చేయాల్సింది పోయి.. తమ ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికి ‘ప్రెస్‌మీట్‌’ పేరుతో ‘రికార్డెడ్‌’ ప్రసంగం లాంటిది చేస్తే ఎలా.?

నిజమే, రానున్న రోజుల్లో కరోనా వైరస్‌తో మనం కొంతకాలమైనా సహజీవనం చేయాల్సిందే. వేరే దారి లేదు. మరి, ప్రజల్ని అందుకు సన్నద్ధం చేసే పద్ధతి ఇదేనా.? అన్నదే ఇక్కడ కీలకం. ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతను వదిలేసి, అధికార పక్షం ఫక్తు రాజకీయాలు చేస్తూ, విపక్షాలపై ‘స్లీపర్‌ సెల్స్‌’ అంటూ దిక్కుమాలిన ఆరోపణలు చేయడంలోనే.. ప్రభుతంలో వున్నవారికి ప్రజల పట్ల వున్న బాధ్యత ఏంటో అర్థమవుతోంది. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెడితే.. అందులో ప్రజలకు భరోసా కన్పిస్తుంటుంది. అధికారుల్ని, మంత్రుల్ని తన వెంట తీసుకొచ్చి మరీ సుదీర్ఘంగా మాట్లాడతారు కేసీఆర్‌. ఆ హుందాతనం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిలో మచ్చుకైనా కన్పించదేం.?

కరోనా పై పోరాటంలో భాగంగా ఈ నెలరోజుల్లో టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచుకోగలిగాం. దేశంలోనే అత్యధిక కోవిడ్ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉంది. ఈ నెలరోజుల్లో వైద్య సదుపాయాలను పెంచుకుని ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయగలిగాం.As a part of Andhra Pradesh's fight against Corona Virus, we have ramped up the testing capacity substantially so far this month. AP is conducting the highest number of COVID tests per million population in the country. With the expansion in health infrastructure, we are able to strengthen the health care system in the state.

Posted by YS Jagan Mohan Reddy on Monday, April 27, 2020