జగనన్న విద్యా కానుక: సొమ్ములెవరివి.? సోకులెవరివి.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని తెరపైకి తెచ్చిన విషయం విదితమే. అయితే, భారతీయ జనతా పార్టీ మాత్రం ‘సొమ్ము మాది, పేరు మీది..’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. ‘కేంద్రం 60 శాతం నిధులు ఇస్తోంటే, రాష్ట్రం 40 శాతం మాత్రమే ఈ పథకం కోసం ఖర్చు చేస్తోంది.. కానీ, ఎక్కడా ప్రధాని నరేంద్ర మోడీ పేరు వాడకుండా, వైఎస్‌ జగన్‌ పేరు వాడుతున్నారు..’ అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇంతకీ సొమ్ములెవరివి.? సోకులెవరివి.? అన్న చర్చ ఇప్పుడు సాధారణ ప్రజానీకంలోనూ జరుగుతోంది.

నిజానికి, ప్రభుత్వ పథకాలకు అధికారంలో వున్నవారి పేర్లో.. వారికి సంబంధించినవారి పేర్లో పెట్టుకోవడం కొత్త కాదు. చంద్రబాబు హయాంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ పేరు, చంద్రబాబు పేరు ఆయా పథకాలకు ప్రముఖంగా వినిపించింది. అంతకు ముందు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇందిరాగాంధీ పేరు, రాజీవ్‌ గాంధీ పేరు వాడేవారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో వైఎస్సార్‌ పేరుతోపాటు, జగన్‌ పేరు కూడా ఆయా పథకాలకు వినిపిస్తోంది. అయితే, సాధారణ ప్రజానీకం వాదన ఇంకోలా వుంది. ‘ఇది ఎవరో పెట్టిన భిక్ష కాదు.. ఇది మా సొమ్ము.. ఇది మా హక్కు.. ప్రభుత్వమంటే ప్రజల కోసం పనిచేయాలి. అలా పనిచేసే క్రమంలో ఆయా పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టుకోవడం సిగ్గు చేటు..’ అంటూ జనం నినదిస్తున్నారు. నినదించడమే కాదు, ‘ఇది ఎవరో ఇచ్చిన కానుక కాదు, ఇది మా హక్కు..’ అంటూ ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన స్కూల్‌ బ్యాగ్స్‌పై కొందరు విద్యార్థులు రాసుకుంటూ, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

కాగా, కేంద్రం పాఠ్య పుస్తకాలు సహా కొన్నిటికి మాత్రమే నిధులు ఇస్తోందని, మిగతా ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వానిదేననీ, స్కూల్‌ బ్యాగుల కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తోందని మంత్రి సురేష్‌, బీజేపీపై కౌంటర్‌ ఎటాక్‌కి దిగారు. బీజేపీకి సమాధానం చెప్పారు సరే, ‘ఇది మా హక్కు’ అంటోన్న ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది.? స్కూల్‌ బ్యాగుల మీదా, ఆఖరికి బెల్టుల మీదా ‘జగనన్న విద్యా కానుక’ అని రాయడాన్ని ఎలా సమర్థించుకుంటుంది.?