ఫ్లైఓవర్ మా ఫలితమే.. సీఎం జగన్ చేసిందేమీ లేదు: కేశినేని నాని

విజయవాడ, అమరావతి అంటే సీఎం జగన్ ఎంత ధ్వేషమో మరోసారి నిరూపితమైందని టీడీపీ ఎంపీ కేశినేని అన్నారు. వర్చువల్ విధానంలో ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ కనకదుర్గ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్లైఓవర్ పైనే మీడియాతో మాట్లాడారు. గతంలో ప్రతిపక్షాలు సాధ్యం కాదని చెప్పిన ఫ్లైఓవర్ నిర్మాణమై ప్రారంభోత్సవం జరగడానికి టీడీపీ హయాంలో తాము చేసిన కృషి ఫలితమేనని అన్నారు. తన విన్నపం మేరకే గడ్కరీ 6వేల కోట్ల పనులు మంజూరు చేశారన్నారు.

2600 కోట్లతో బైపాస్ రోడ్డు కొత్తగా వచ్చింది. 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయాలని సీఎం అడుగుతారని భావించానని అన్నారు. కానీ.. జగన్ అడగలేదు. దీనినిబట్టి ఆయనకు విజయవాడ, అమరావతి అంటే ఎంత ధ్వేషమో అర్ధమవుతుందన్నారు. 200 కోట్లు ఖర్చయ్యే ఈస్ట్రన్ బైపాస్ అడిగారని అన్నారు. ఫ్లైఓవర్ కోసం తాము ఎంతో పోరాడామని.. ఫలితంగా దేశంలోనే అద్భుతమైన కట్టడంగా నిలిచిందన్నారు.

టీడీపీ హయాంలో అనేక ప్రాజెక్టులు రాష్ట్రొనికి వచ్చిన సంగతిని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఇటుక వేసి ప్రారంభించిన ప్రాజెక్టు లేదన్నారు. తాము తెచ్చిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. బస్టాండ్ కంటే కళా విహీనంగా ఉన్న ఎయిర్ పోర్టును అప్పట్లో టీడీపీ ప్రభుత్వమే అభివృద్ధిలోకి తీసుకొచ్చిందన్నారు.