వైఎస్‌ జగన్‌ క్రిస్టియనా.? కాదా.?

‘వైఎస్‌ జగన్‌ హిందువు కాదు.. క్రిస్టియన్‌.. ఆయన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళి డిక్లరేషన్‌ ఇవ్వలేదు. అన్యమతస్తులు వెంకటేశ్వరస్వామిని తిరుమలలో దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌ తప్పనిసరి..’ అంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలైన విషయం విదితమే. ‘ఆయన క్రిస్టియనో కాదు, మనమెలా నిర్ణయించగలం.?’ అంటూ ఈ వివాదంపై ఇటీవల బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా.

ఇంతకీ, వైఎస్‌ జగన్‌ క్రిస్టియనా.? హిందువా.? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేదెలా.? వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్రిస్టియన్‌. ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోగా, పార్తీవదేహానికి అంత్యక్రియలు క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం జరిగాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి చేతిలో ఎప్పుడూ బైబిల్‌ వుంటుంది. ‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్రిస్టియన్‌. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా క్రిస్టియనే అవుతాడు కదా..’ అంటూ ఓ ఇంటర్వ్యూలో విజయలక్ష్మి స్పష్టం చేశారు.

కుమారుడిది ఏ మతమో తల్లి కంటే ఎవరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు.? కానీ, ఇక్కడ న్యాయస్థానానికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అదే విషయాన్ని న్యాయస్థానం స్పష్టం చేసింది. వైఎస్‌ జగన్‌ క్రిస్టియన్‌ అని ఎలా చెప్పగలం.? క్రిస్టియనో కాదో తేల్చకుండా కేసులో విచారణ ముందుకు ఎలా సాగుతుంది.? అంటూ న్యాయస్థానం పిటిషన్‌దారుడ్ని ప్రశ్నించింది.

సో, ఈ కేసులో పిటిషన్‌దారుడు, వైఎస్‌ జగన్‌ది ఏ మతం.? అన్న విషయమై నిరూపించాలన్నమాట.. అందుకు తగ్గ ఆధారాల్ని న్యాయస్థానానికి సమర్పించాలన్నమాట. సదరు పిటిషన్‌ దారుడికి న్యాయస్థానం కొంత గడువు కూడా ఇచ్చింది. గడువులోగా పిటిషన్‌దారుడు ఎలాంటి ఆధారాలు సమర్పించగలడు.? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా వుంటే, చాలామంది రాజకీయ ప్రముఖుల ‘మతం’ విషయమై చాలా వివాదాలున్నాయి. వైఎస్‌ జగన్‌ మంత్రి వర్గంలో వున్నవారిలోనూ కొందరిపై ఇవే తరహా వివాదాలున్నాయి. ఓ మతానికి చెందిన వ్యక్తి, ఇంకో మతం పట్ల విశ్వాసం వుండడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఆయా వ్యక్తులు మతం మారితే.? ఈక్వేషన్స్‌ మారతాయి. రిజర్వేషన్లు వంటివన్నమాట.

మతం మార్చేకుసుకుని, రిజర్వేషన్ల కోసం.. తాము మతం మారలేదని చెప్పే రాజకీయ నాయకులూ వున్నారు. ఇలాంటి లెక్కలన్నీ తేల్చడం ఆషామాషీ వ్యవహారం కాదు.! ఇంతకీ, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిది ఏ మతం.? ఏమో మరి.. కోర్టులో తేలుతుందేమో వేచి చూడాలి.