రూల్స్‌ అతిక్రమిస్తే భారీ జరీమానాలు.. ప్రభుత్వాలకో మరి.!

‘వాహనదారుల భద్రత’ కోసం కొన్ని నిబంధనలున్నాయి. ఆ నిబంధనల్ని అతిక్రమిస్తే భారీ జరీమానాలు తప్పవు. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించాలంటే, నిబంధనల్ని పాటించడం తప్పనిసరి. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలిసి తెలిసి ఎవరైనా తమ ప్రాణాల్ని పణంగా పెడతారా.? ఛాన్సే లేదు. కానీ, రూల్స్‌ అతిక్రమణ మాత్రం జరుగుతూనే వుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, కేంద్రం గతంలోనే భారీగా ట్రాఫిక్‌ జరీమానాల్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్రాలు ఆ జరీమానాల్లో కొన్నింటిని అమలు చేస్తున్నాయి కూడా.

ఇక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఇంకో అడుగు ముందుకేసి.. భారీ జరీమానాలు విధించే దిశగా చర్యలు షురూ చేసింది. రోడ్డెక్కి రూల్స్‌ అతిక్రమిస్తే, జేబుకి చిల్లు పడటం మాత్రమే కాదు.. నిలువుదోపిడీకి గురవ్వాల్సి వస్తుంది ఇకపై వాహనదారులకి. నిజానికి, ఇలాంటి నిర్ణయాల్ని ఎవరూ తప్పుపట్టకూడదు. ఎందుకంటే, ఒకరి నిర్లక్ష్యం ఇంకొకరి ప్రాణాల్ని బలిగొనే అవకాశం వుంటుంది రోడ్డు ప్రమాదాల విషయంలో.

ఒక్కోసారి ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా పది మంది, పాతిక మంది.. వంద మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్నీ చూస్తుంటాం. అయితే, ఇక్కడ వాహనదారుల వేదనని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలి. రోడ్లు బాగాలేక ప్రమాదాలు జరిగితే, దానికి బాధ్యత ఎవరు వహించాలి.? దీనికి ప్రభుత్వాల వద్ద సమాధానమే వుండదు. వాహనం కొనుగోలు చేసినప్పటినుంచి.. ట్యాక్స్‌ల బాదుడు ఏదో ఒక రూపంలో వుంటూనే వుంటుంది. మరి, అలాంటప్పుడు.. ప్రభుత్వాలు, సరైన రోడ్లు వేయాలి కదా.? టోల్‌ గేట్లు వుంటాయ్‌.. కానీ, రోడ్లు అధ్వాన్నంగా వుంటాయ్‌. ఇవన్నీ ప్రతి ప్రభుత్వమూ పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది.

ఖచ్చితంగా ప్రభుత్వాల బాధ్యతారాహిత్యానికీ జరీమానాలు వుండాలి. అధికారులే కడతారో, కాంట్రాక్టర్లే కడతారోగానీ.. అలా విధించే జరీమానాలు వాహనదారుల ఖాతాల్లోకి మళ్ళిస్తే బావుంటుందేమో. కానీ, జనాన్ని ఉద్ధరించే అలాంటి బాధ్యతగల ప్రభుత్వాల గురించి ఆశించడం దండగే. ఇక, ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఆటోవాలాల కోసం ఆ మధ్య ఓ పథకాన్ని తీసుకొచ్చారు. కానీ, ఇప్పుడు ఈ చలానాల పెంపుతో.. ఆటోవాలాల నడ్డి విరిచేసినట్లే. ఒక్క ఉల్లంఘన దెబ్బకి.. ఆటోవాలా జీవితం ఛిద్రమైపోతుంది. ఆటోలు నడిపేవారిలో ఎంతమంది దగ్గర సరైన పత్రాలు వుంటున్నాయి.? ఆటోలు నడిపేవారే కాదు, పల్లెటూళ్ళలో వాహనాల పరిస్థితేంటి.? ఇవన్నీ ఆలోచిస్తే, ఎవరికైనా మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది. కానీ, వాహనాలు రోడ్డుపై బాధ్యతాయుతంగా నడపడం ప్రతి వాహనదారుడికీ తప్పనిసరి.

అదే సమయంలో, వాహనదారులకి గతుకులు, గుంతల్లేని రోడ్లను అందించడం ప్రభుత్వాల విధి. చలానాలు వేసే ముందు, తమ వైఫల్యాల గురించి ఏ ప్రభుత్వమైనా విజ్ఞతతో, చిత్తశుద్ధితో ఆలోచిస్తే.. చలానా పేరెత్తే సాహసం ప్రభుత్వాల్ని నడిపేవారు చేయలేరేమో.!