అమరావతి కోసం భూములిచ్చిన రైతులు 300 రోజులకు పైగా ఆందోళనలు చేపడుతున్న విషయం విదితమే. ‘ఒకే ఒక్క రాజధాని అమరావతి..’ అనే నినాదంతో అమరావతి రైతులు ఆందోళనలు చేస్తోంటే, దానికి కౌంటర్‌గా ‘ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ, అసలు సిసలు ‘పెయిడ్ బ్యాచ్’ రంగంలోకి దిగింది. అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల అమరావతి రైతులు ప్రత్యేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, దానికి పోటీగా ‘3 క్యాపిటల్స్ పెయిడ్ బ్యాచ్’ హంగామా చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్యా రచ్చ చోటు చేసుకుంది.
మరోపక్క, అలా ‘3 క్యాపిటల్స్’ పేరుతో వచ్చినవారెవరు.? అన్న విషయమై అమరావతి రైతులు ఆరా తీయడం మొదలు పెట్టారు. అందులో ఎవరూ రాజధాని పరిధిలోని వ్యక్తులు కాదన్నది అమరావతి రైతుల వాదన. సరే, వాళ్ళవరు.? అన్నది పక్కన పెడితే, వాళ్ళని ఆటోల్లో తరలించిన మాట వాస్తవం. ఇందుకోసం పెద్దయెత్తున ఖర్చు చేశారట. ‘రోజు కూలీ’ తరహాలో రాజకీయ పార్టీల కార్యక్రమాలకు జనాన్ని తరలించడం మామూలే. ఈ ‘3 క్యాపిటల్స్ పెయిడ్ బ్యాచ్’కి కూడా అదే స్థాయిలో చెల్లింపులు జరిగాయంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఒక్క రోజు కాదు, ఇకపై ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు జరుగుతాయ్.. ఇందు కోసం ప్రత్యేకంగా శిబిరాల ఏర్పాటు కూడా షురూ అవుతోంది.. పెద్దయెత్తున ఇందుకోసం ఖర్చు చేయబోతున్నారు..’ అంటూ జరుగుతున్న ప్రచారంతో రాష్ట్ర ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇంతకీ, ‘3 క్యాపిటల్స్ పెయిడ్ బ్యాచ్’ కోసం అంతలా సొమ్ములు వెచ్చిస్తున్నదెవరు.? అంటే, ఇంకెవరు.. అధికార పార్టీనే అన్నది అమరావతి రైతుల వాదన. ‘ఆధార్ కార్డులు చూపించాలి..’ అంటూ అమరావతి రైతులు డిమాండ్ చేస్తుండడంతో, ‘పెయిడ్ బ్యాచ్’ కాస్తా ఇబ్బంది పడుతోంది. కొందరు లోకల్ వ్యక్తుల మద్దతు వారికి వుండడంతో, ఆ లోకల్ వ్యక్తులూ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏంటో ఈ రాజకీయం. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా నడుస్తున్నాయి ఈ ‘పెయిడ్’ వ్యవహారాలు.