వైఎస్‌ జగన్‌ కూడా దీక్షలు చేయక తప్పదా.?

దొంగ దీక్షలు చేయడం, ప్రజల్ని వంచించడం రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు రాజకీయ నాయకులు చేసే దీక్షలకీ, ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్న దీక్షలకీ అస్సలు పొంతన లేదు. ఒకప్పుడు ఆమరణ నిరాహార దీక్షలుండేవి.. ఇప్పుడు ఆ పేరుతో ఇరవై నాలుగ్గంటల దీక్షలు, 36 గంటల దీక్షలు ప్రచారంలోకి వచ్చాయి.

అసలు విషయానికొస్తే, చంద్రబాబు – బీజేపీతో సంబంధాలు తెంచుకున్నా, ‘ధర్మ పోరాట దీక్ష’ అంటూ ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము వెచ్చించి పొలిటికల్‌ స్టంట్లు చేశారు. ముందు ముందు అదే పని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేయాల్సి వచ్చేలా వుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం తీరుని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.. అయితే, బీజేపీ మీద విమర్శలు చేయాల్సిన వైసీపీ, చిత్రంగా చంద్రబాబు మీద నోరు పారేసుకుంటోంది.

గతంలో చంద్రబాబు చేసింది అదే. కేంద్రాన్ని ప్రశ్నించాల్సింది పోయి, వైసీపీని విమర్శించేవారు చంద్రబాబు అండ్‌ కో అప్పట్లో. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, కేంద్రాన్ని ప్రశ్నించలేక.. టీడీపీ మీద విరుచుకుపడిపోయారు. 54 వేల కోట్ల ప్రాజెక్టులో 20 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఎంత శాతం మేర ప్రాజెక్టు పూర్తయినట్లు.? అంటూ ‘లెక్కలు తెలియనట్లు’ అమాయకంగా ప్రశ్నించేశారు.

ప్రాజెక్టుల అంచనా వ్యయాలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. ప్రాజెక్టు ఆలస్యమయ్యేకొద్దీ, ఆయా ప్రాజెక్టులు ఆర్థిక భారంగా మారతాయి ప్రభుత్వాలకి. ఆ లెక్కలు తెలియని అనిల్‌ మంత్రి పదవిలో వుండడానికి అనర్హుడని టీడీపీ అంటోంది. సరే, టీడీపీ – వైసీపీ గొడవ పక్కన పడేస్తే, కేంద్రాన్ని ప్రశ్నించేది ఎవరు.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

టీడీపీ – వైసీపీ కొట్టుకుంటోంటే, బీజేపీ చోద్యం చూస్తోంది. ‘మేం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో వున్నాం..’ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి, ఈ నిధుల పంచాయితీ ఏంటి.? అంటే, దానికి మాత్రం ఏపీ బీజేపీ నేతల నుంచి సమాధానమే రావడంలేదు. మరి, ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చేదెవరు.? ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ పోలవరం ప్రాజెక్టు నిమిత్తం దీక్షలు చేస్తారా.? చేస్తే ఎప్పుడు.? ఇదిప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.