జగనన్న దుర్నీతి: నచ్చితే పొడిగింపు.. నచ్చకపోతే కత్తిరింపు.!

జగనన్న రాజ్యాంగం అంతే.! నచ్చితే పొడిగింపు.. నచ్చకపోతే కత్తిరింపు.! అవసరానికి తగ్గట్టుగా ‘విధానాలు’ మారిపోతాయ్‌.! అనూహ్యంగా తెరపైకి ఆర్డినెన్సులు వచ్చేస్తాయ్‌.! అయినా, తనకు నచ్చలేదని రాజధానిని మార్చేయాలనుకుంటున్న.. తనకు నచ్చని కారణంగా తెలుగు మీడియంని రద్దు చేయాలనుకుంటున్న.. తనకు నచ్చలేదని శాసన మండలినే ఎత్తివేయాలనుకుంటున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి, అధికారులు ఓ లెక్కా.?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, తమ ప్రభుత్వానికి అనకూలంగా వ్యవహరించకపోవడంతో, అడ్డగోలు ఆర్డినెన్స్‌తో ప్పించిన ఘనత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికే దక్కుతుంది. ఈ క్రమంలో అత్యంత నీఛంగా ఎన్నికల కమిషనర్‌ మీద ‘కులం’ ముద్ర వేయడాన్ని సభ్య సమాజమంతా తప్పుపడ్తున్నా, ‘నా దారి అడ్డదారి’ అంటోంది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఇక, స్టేట్‌ లెజిస్లేచర్‌ సెక్రెటరీగా పనిచేస్తున్న బాలకృష్ణాచార్యులు పదవీకాలం నేటితో ముగియాల్సి వుండగా.. మరో ఏడాది ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

‘పొడిగింపు’ అనేది ప్రభుత్వ నిర్ణయం.. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ, ఉన్నతాధికారుల్ని అడ్డగోలుగా పీకి పారేయడమే ఇక్కడ అత్యంత హేయమైన విషయం. కొన్నాళ్ళ క్రితం ఉన్నతాధికారి జాస్తి కృష్ణకిషోర్‌పై నానా రకాల ఆరోపణలూ మోపి పదవి నుంచి తొలగించింది జగన్‌ ప్రభుత్వం. కానీ, కేంద్రం సదరు కృష్ణకిషోర్‌కి కీలక పదవి ఇచ్చి గౌరవించింది. రేప్పొద్దున్న ఏబీ వెంకటేశ్వరరావు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈలోగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారంలో ప్రభుత్వానికి మొట్టికాయలు పడినా పడొచ్చు.

అయినా, ఏడాది కాలంలోనే 50కి పైగా మొట్టకాయలు న్యాయస్థానాల్లోనే తగిలాక.. కొత్త మొట్టికాయలు ఓ లెక్కా.? ప్రభుత్వానికీ విశేషాధికారాలు వుంటాయి. కానీ, అవి మంచి ఆలోచనల మేరకు వినియోగించాల్సి వుంటుంది. అంతే తప్ప, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు విశేషాధికారాల్ని వినియోగిస్తే.. అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?