దిగజారుడు రాజకీయం: ఏపీ అసెంబ్లీలో అదే రచ్చ.!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల నుంచి రాష్ట్ర ప్రజలు ఇంతకన్నా ఏం ఆశించగలరు.? అధికార పక్షం రెచ్చగొడుతుంది.. ప్రతిపక్షం ఆవేశంతో ఊగిపోతుంటుంది.. ప్రతిపక్షం రెచ్చగొడుతుంటుంది, అధికార పక్షం ఆవేశంతో ఊగిపోతుంటుంది. ఒకాయన భారీ కాయం గురించి ఇంకొకాయన సెటైర్లు వేస్తారు. అసెంబ్లీకి వెళుతున్నది ఇందుకా.? అసలు ప్రజలు అసెంబ్లీకి ప్రజా ప్రతినిథుల్ని పంపుతున్నది ఎందుకు.? ఈ విషయమై రాష్ట్ర ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది.

‘ప్రతిపక్షం దిగజారుడు రాజకీయం చేస్తోంది అధ్యక్షా..’ అంటారు మంత్రి పేర్ని నాని. కానీ, అధికారపక్షంపై ఘాటైన విమర్శలు చేస్తుంటుంది టీడీపీ. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలో నేల మీద కూర్చోవాల్సి వచ్చింది. ఇందులో రాజకీయ ప్రయోజనం ఆయన ఏం ఆశించారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆ స్థాయికి ప్రతిపక్ష నేతని రెచ్చగొట్టిన వైసీపీ వ్యూహాన్ని తప్పు పట్టకుండా వుండగలమా.?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో బూతుల ప్రవాహం కొత్తదేమీ కాదు. మైక్‌లకు దొరక్కుండి, మైక్‌లకు దొరికిపోతూ.. ఎన్నెన్నో బూతులు మాట్లాడేస్తున్నారు సభ్యులు. ‘ఇది శాసన సభ.. కోట్లాదిమంది మనల్ని చూస్తున్నారు.. సభ్య సమాజానికి ఏం సంకేతాలిస్తున్నాం మనం.?’ అన్న ఆత్మ విమర్శ సభ్యుల్లో కన్పించకపోవడమే ఈ దుస్థితికి కారణం.

తాజా అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రెచ్చగొట్టుడు వ్యవహారం తీవ్రస్థాయిలో నడిచింది. వ్యవసాయమో, వరద సాయమో.. ఇంకో అంశమో.. చర్చ అంటూ జరగాలి కదా.! అధికార పార్టీ సభ్యులు కూర్చుని మాట్లాడుకుంటే అది పార్టీ సమావేశమవుతుందిగానీ, శాసన సభ ఎలా అవుతుంది.? టీడీపీ సభ్యుల్ని స్పీకర్‌ సస్పెండ్‌ చేసేశారు సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారనే నెపంతో.

చంద్రబాబు హయాంలో వైసీపీపైనా ఇవే చర్యలు. దానికి ప్రతిఫలంగా తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితిని అనుభవిస్తోంది. ‘అప్పుడు టీడీపీ మమ్మల్ని గెంటేసింది, ఇప్పుడు టీడీపీని మేం గెంటేస్తున్నాం..’ అని వైసీపీ చెప్పుకోవచ్చుగాక.. కానీ, అక్కడ వైసీపీ గెంటేస్తోన్నది.. టీడీపీ శాసన సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్ని.. ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని. ఈ సోయ అధికారంలో వున్న పార్టీలకు వుంటే.. అసెంబ్లీలో సస్పెన్షన్‌ అనే మాటే వినపడదు.

అయినా, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అసెంబ్లీలో నిరసన పేరుతో కింద కూర్చోవడమేంటి.? డ్రామా క్రియేట్‌ చేయాలన్న దుగ్ధ కాకపోతే.