లోకల్‌ ఫైట్‌: జగన్‌ సర్కార్‌కి హైకోర్టులో చుక్కెదురు.!

కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల్ని ఫిబ్రవరిలో నిర్వహించడం కుదరంటూ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి షాక్‌ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ఈ మేరకు ప్రభుత్వానికి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సమాచారం ఇచ్చింది. అయితే, ప్రభుత్వం మాత్రం స్థానిక ఎన్నికల నిర్వహణకు ససేమిరా అంటోంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మీద ఇప్పటికే కులం ముద్ర వేసిన వైఎస్సార్సీపీ, ఆయన్ని చంద్రబాబు ఏజెంట్‌గా అభివర్ణిస్తోంది. ఇవే ఆరోపణలతో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ని గతంలో రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తే, న్యాయస్థానాల్ని ఆశ్రయించిన నిమ్మగడ్డ, తన పదవిని కాపాడుకోగలిగారు. అయినాగానీ, జగన్‌ సర్కార్‌కీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కీ మధ్య ‘వైరం’ అలాగే కొనసాగుతూ వచ్చింది.

ఎప్పటికప్పుడు వైసీపీ నేతలు, నిమ్మగడ్డపై తీవ్రస్థాయిలో దూషణలకు దిగుతూనే వున్నారు. ఆ దూషణలపైనా నిమ్మగడ్డ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఆయన పలువురు మంత్రులపై గవర్నర్‌కి ఫిర్యాదు కూడా చేశారు. తన టెర్మ్‌లో ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ, ఆయన వుండగా ఎన్నికలు జరగకుండా చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న దరిమిలా, అసలు ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు తావిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.

లాక్‌డౌన్‌కి ముందే రాష్ట్రంలో కొంత మేర స్థానిక ఎన్నికల ప్రక్రియ ముందుకు నడిచింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌కి కొద్ది రోజుల ముందర నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చాకచక్యంగా వ్యవహరించి, ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. దానిపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం గుస్సా అయ్యింది. ఆ రోజు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయకుండా వుండి వుంటే.. రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేదనే వాదన వుంది.

సరే, ఆ వాదనలో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం కరోనాని కుంటిసాకుగా మాత్రమే వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చూపుతోంది.. ఎన్నికల నిర్వహణకు అడ్డుపడుతోంది. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి షాకిచ్చిన దరిమిలా, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కి స్థానిక ఎన్నికల విషయమై లైన్‌ క్లియర్‌ అయినట్లుగానే భావించాలేమో. అయితే, తమకు ఇంకా అవకాశం వుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.. అంతలా మొట్టికాయలు వైసీపీకి అలవాటైపోయాయ్‌ మరి.