‘ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీని విస్తరిస్తే తప్పేముంది.? కొత్త పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టకూడదనే రూల్ ఏమైనా వుందా.?’ అంటూ ఎదురు ప్రశ్నించేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ‘ఆంధ్రప్రదేశ్‌లో కూడా మీ పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారట కదా.?’ అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.!
వాస్తవానికి తెలంగాణలో కంటే, వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రశ్నించాల్సిన అవసరం ఎక్కువ వుంది. అది ఆమె బాధ్యత కూడా. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి తనవంతు కీలక భూమిక పోషించారు.
ఆ తర్వాత ఏమయ్యిందోగానీ, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దూరమయ్యారు షర్మిల. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఇద్దరి మధ్యా ఆస్తుల వివాదాలు తలెత్తినట్లుగా ప్రచారం జరుగుతోంది కూడా. ‘షర్మిలను పార్టీ పెట్టొద్దని వైఎస్ జగన్ సూచించారు. కానీ, ఆమె తన అన్న మాటని లెక్క చేయలేదు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మధ్యన వ్యాఖ్యానించడం, సజ్జల వ్యాఖ్యల పట్ల షర్మిల అసహనం వ్యక్తం చేయడం తెలిసిన సంగతులే.
ఇక, ఇప్పుడు షర్మిల, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారన్న ప్రచారమే నిజమైతే మాత్రం.. ఏపీలో వైసీపీకి గడ్డుకాలమే ఎదురుకానుందన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే, తాము వైఎస్సార్ అభిమానులమని చెప్పుకునే చాలామంది వైసీపీ నేతల్లో చీలిక తీసుకురాగలరు షర్మిల.
వాగ్ధాటి విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికంటే వైఎస్ షర్మిలకి స్పష్టత ఎక్కువ. పైగా, పాదయాత్ర విషయంలోనూ వైఎస్ జగన్ తరహాలోనే, ఆ మాటకొస్తే.. ఇంకాస్త చిత్తశుద్ధితో షర్మిల పాదయాత్ర చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు షర్మిలకు ప్లస్ అవుతాయి.
అయినాగానీ, అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ విభేదాలు.. అనే నిర్ధారణకు వచ్చేయలేం. తమ పాలన పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి డైవర్షన్ కోసం వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసి, షర్మిలతో ఏపీలో రాజకీయం.. అనే అంశాన్ని తెరపైకి తెచ్చారనే అనుమానాలూ లేకపోలేదు.
అన్నిటికీ మించి, షర్మిల తన అన్నను కాదని ఏపీలో రాజకీయాలు చేసే అవకాశమైతే లేదు.