వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: ఇదేం ట్విస్ట్ మహాప్రభో.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయి రెండేళ్ళు పూర్తయినా, ఇంకా ఈ కేసులో దోషులెవరో తేలలేదు. సీబీఐ, ఇటీవల పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత ఈ కేసు విచారణ విషయమై రాష్ట్ర రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన రీతిలో చర్చలు షురూ అయ్యాయి. గతంలో సీబీఐ, ఈ కేసుని విచారిస్తున్న సమయంలో.. సునీల్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు పరార్ అయ్యారు.

అయితే, సీబీఐ వేధింపులు తట్టుకోలేక సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడానికే గోవా వెళ్ళినట్లు సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులిపుడు చెబుతుండడం గమనార్హం. సీబీఐ, సునీల్ యాదవ్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిందనీ, ఈ విషయమై హైకోర్టును కూడా ఆశ్రయించామనీ, సీబీఐ అమ్ముడుపోవడం వల్లే, ఏ సంబంధం లేని సునీల్ యాదవ్ మీద కేసులు బనాయించిందని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వివేకా కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేసిన 11 నుంచి 15 మందిలో తన కుమారుడు సునీల్ యాదవ్ పేరు లేదని సునీల్ యాదవ్ తండ్రి చెబుతుండడం మరో ఆసక్తికర అంశం. ‘హంతకులెవరో పులివెందులలో అందరికీ తెలుసు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, వైసీపీ నేతలందరికీ తెలుసు. పెద్దవాళ్ళు తప్పించుకునేందుకే సునీల్ మీదకి కేసు మారేలా ప్లాన్ చేశారు..’ అన్నది సునీల్ యాదవ్ కుటుంబ సభ్యుల వాదన.

ఇలాంటి కేసుల్లో ఇలాంటి ఆరోపణలు సహజాతి సహజం. రెండేళ్ళ తర్వాత వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. అని సునీల్ యాదవ్ అరెస్టుపై ప్రచారం జరుగుతున్న సమయంలో, సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చి సరికొత్త ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరమే. పైగా, వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం మూడు రోజుల నుంచి సీబీఐ అన్వేషిస్తోంది.. అదీ సునీల్ ఇచ్చిన సమాచారంతో. కానీ, ఆయుధాలు దొరకలేదాయె.

ఏమో, ఈ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందోగానీ, ఓ మాజీ మంత్రి.. మాజీ ఎంపీ హత్య కేసులో నిజాలు వెలుగుచూడ్డానికి ఇంత సమయమా.? వ్యవస్థలెంత అచేతనావస్థలో వున్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?