వైసీపీ నేతల కరోనా పైత్యం: జగన్‌ సారూ.. మీకర్థమవుతోందా.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిథులు తమ మీద పూలు చల్లించుకున్నారు.. పూల బాట వేయించుకుని.. రాచరిక పాలనను గుర్తుకు తెచ్చారు.

ప్రజా ప్రతినిథులు కాకపోయినా, కొందరు వైసీపీ నేతలు జనాలోకి వెళ్ళి ప్రభుత్వం తరఫున అధికారులు ఇవ్వాల్సిన కరోనా సాయం (వెయ్యి రూపాయల్ని) ప్రజలకు ఇస్తూ పబ్లిసిటీ చేసుకున్నారు. కరోనా వైరస్‌కి కూడా రాజకీయ రంగు అంటించడంలో వైసీపీ నేతలు చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఈ పబ్లిసిటీ పైత్యమే కరోనా వ్యాప్తికి కారణమంటూ టీడీపీ సహా ఇతర విపక్షాలు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కానీ, అధికార పార్టీ మాత్రం, విపక్షాలపై ఎదురుదాడి చేసింది తమ వైఫల్యాల్ని కప్పిపుచుకుంటూ.

ఇక, ఈ వ్యవహారాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది హైకోర్టులో. ప్రజా ప్రతినిథులే కరోనా లాక్‌డౌన్‌ని ఉల్లంఘిస్తే ఎలా.? అంటూ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఆయా ప్రజా ప్రతినిథులపై ఉన్నతస్థాయి విచారణ ఎందుకు జరపకూడదు.? అంటూ ప్రశ్నించింది న్యాయస్థానం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సోషల్‌ డిస్టెన్సింగ్‌ని చాలామంది వైసీపీ నేతలు పాటించలేదనడానికి లెక్కలేనన్ని ఫొటోలు, వీడియోలు సాక్ష్యాలుగా వున్నాయి. అవన్నీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

నిజానికి, లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు సంబంధించి మామూలుగా అయితే తమను తాము సమర్థించుకోలేని పరిస్థితి వైసీపీది. కానీ, ఎదురుదాడి చేయడంలో సమర్థులైన అధికార పార్టీ నేతలు.. షరామామూలుగానే తమకు తెలిసిన విద్యను ప్రదర్శిస్తున్నారు. న్యాయస్థానం ఇంత ఘాటుగా స్పందించాక అయినా జగన్‌ సర్కార్‌ తగిన చర్యలు తీసుకుంటుందా.?