అక్షయ్‌కుమార్.. ఇంకో సౌత్‌ సినిమా రీమేక్!

దక్షిణాది సినిమాల రీమేక్ ల పట్ల ఉత్సాహంతో ఉండే బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ కూడా ముఖ్యుడు. కెరీర్ మొదలు నుంచి చాలా సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేశాడు ఈ కిలాడీ హీరో. దక్షిణాదిన హిట్టైన బోలెడు సినిమాల్లోని పాత్రలను హిందీలో తనదైన శైలిలో పండించాడు అక్కీ.ఈ పరంపరలో.. ఈ హీరో మరో సౌత్ సినిమా రీమేక్ కు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సారి హారర్ కామెడీని ఎంచుకున్నాడు. అది కూడా లారెన్స్ సినిమాను. తమిళ, తెలుగు భాషల్లో హిట్టైన ‘కాంచన-2’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నాడట అక్షయ్.

లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తాప్సీ, నిత్యమినన్ లు ప్రధాన పాత్రల్లో నటించారని వేరే చెప్పనక్కర్లేదు. లారెన్స్ ముని సీరిస్ లో చేసిన మూడో విజయవంతం అయిన సినిమా ఇది. ప్రస్తుతం లారెన్స్ ముని నాలుగో వెర్షన్ పనిలో ఉన్నాడు.ఇంతలో ముని మూడో వెర్షన్ హిందీలో రీమేక్ ప్రతిపాదన వస్తోంది. ఇది వరకూ హారర్ జోనర్లో ‘మణిచిత్రతాళ్’ను బాలీవుడ్ లో రీమేక్ చేశాడు అక్షయ్. తమిళ, తెలుగు భాషల్లో ‘చంద్రముఖి’గా ఆ సినిమా సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే.

ప్రియదర్శన్ దర్శకత్వంలో దాన్ని రీమేక్ చేసి హిట్టు కొట్టాడు అక్షయ్. మరోసారి హారర్ సబ్జెక్ట్ చేయాల్సి ఉందని ముచ్చటపడిన అక్షయ్ ఈసారి ముని- 3అలియస్ కాంచన-2ను రీమేక్ చేస్తున్నాడు. దీని హిందీ వెర్షన్ కు కూడా లారెన్సే దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.