‘అదిరింది’ ఎందుకు బెదురుతోంది.?

అక్టోబర్‌ 19న విడుదలవ్వాల్సిన సినిమా.. ఇంతవరకూ ఎందుకు విడుదల కాలేదు.? తమిళంలో ఈ సినిమా సంచలనాలే సృష్టిస్తోంది. రికార్డులు కొల్లగొట్టేస్తోంది. రికార్డులే కాదు, వివాదాలూ సినిమాని వార్తల్లో వుంచుతుండడం గమనార్హమిక్కడ. దేశమంతా ఇప్పుడు ‘మెర్సల్‌’ సినిమా గురించే మాట్లాడుకుంటోంది. ఆ సినిమా తెలుగులో ‘అదిరింది’గా విడుదవ్వాల్సి వుంది. విడుదలై వుంటే, ఇక్కడా సినిమా మంచి విజయాన్నే దక్కించుకుని వుండేది.!

కానీ, తెలుగులో విజయ్‌కి అస్సలేమాత్రం టైమ్‌ బాగోడంలేదు. తమిళంలో పెద్ద స్టార్‌ అయినా, తెలుగులో విజయ్‌ సినిమాలకి అంత ‘సీన్‌’ వుండడంలేదు. కొన్ని హిట్‌ సినిమాలేమో రీమేక్‌ అయిపోతున్నాయి, ఇంకొన్ని సినిమాలు విడుదలైనా తెలుగులో ఆకట్టుకోలేకపోతున్నాయి. ‘మెర్సల్‌’ సినిమా తెలుగులోకి ‘అదిరింది’ పేరుతో ఇంకా విడుదల కాకపోవడం విజయ్‌ బ్యాడ్‌లక్‌ని మరోమారు చెప్పకనే చెబుతోంది.

తెలుగులో మార్కెట్‌ పెంచుకోవాలని విజయ్‌ చాన్నాళ్ళుగా ప్రయట్నిస్తున్నాడు. రజనీకాంత్‌, సూర్య, కార్తీ.. ఇలా తమిళ స్టార్‌ హీరోలే కాదు, కొత్తగా తమిళ సినీ రంగంలోకి వచ్చినవారు కూడా తెలుగు సినిమా మార్కెట్‌పై ఫోకస్‌ పెట్టి, సక్సెస్‌ అవుతున్న విషయం విదితమే. పాపం విజయ్‌.. ఏం చేసినా, తెలుగు మార్కెట్‌పై పట్టు సాధించలేకపోతున్నాడు. ఈసారి ఖచ్చితంగా హిట్టు కొట్టేవాడే.. ఏం చేస్తాం, టైమ్‌ బ్యాడ్‌ అంతే.!