సభ మొదలయ్యాక వెళితే తప్పేంటి?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర షెడ్యూలును మరోసారి వాయిదా వేసుకున్నారు. నవంబరు 6వ తేదీనుంచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 10వ తేదీనుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం దాకా వాయిదా వేసి.. అసెంబ్లీలో కూడా ప్రజల తరఫున వారి కష్టాలను కనీసం ఒకటిరెండు రోజులైనా ప్రస్తావించి.. ప్రజలు ప్రతిపక్ష నేతగా తన మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తించి.. ఆ తర్వాత పెట్టుకుంటే మాత్రం తేడా ఏముంది? అనే వాదన పలువురిలో వినిపిస్తోంది.

పాదయాత్ర ప్రారంభం.. మరో వారం ఆలస్యం అవుతుందే.. తప్ప.. ప్రజల సమస్యలను అధ్యయనంచేసే విషయంలో ఆయన సంకల్పం ఏమీ మారిపోదు కదా? అలాంటప్పుడు ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన చట్టబద్ధమైన వేదిక అసెంబ్లీకి హాజరు కావడం కోసం మరో నాలుగురోజులు ఆగితే తప్పేంటి అనే వాదన వినిపిస్తోంది.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ ‘హాజరు మినహాయింపు కోసం అనుమతి పిటిషన్’ విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి. మినహాయింపు ఎందుకివ్వాలి? అని ప్రశ్నిస్తూనే.. వారానికి ఓసారి కోర్టుకు వస్తే.. న్యాయవ్యవస్థ పట్ల తన శ్రద్ధ ను నిరూపించుకుంటున్నట్లుగా ప్రజల ఎదుట చెప్పుకోవచ్చు కదా? అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఆ మాటకొస్తే.. జగన్ ఒక శాసనసభ్యుడిగా తన ప్రాథమిక బాధ్యతగా శాసనవ్యవస్థ పట్ల తనకున్న బాధ్యతను నిరూపించుకోవాలి. శాసనసభకు హాజరుకావడం అనేది శాసనసభ్యుడి ప్రాథమిక విధి. రాజ్యాంగ ప్రకారం అయితే.. తమ కోసం శాసనసభ చట్టాలు చేసే సమయంలో.. తమ కష్టాలను, తమ స్వరాన్ని వినిపించడానికే ప్రజలు ఎమ్మెల్యేను ఎన్నుకొంటారు తప్ప.. తమకు రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు ఇప్పించడానికి కాదు.

అలాంటి ప్రాథమిక బాధ్యతను జగన్ విస్మరించడం కరెక్టేనా అనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే అక్టోబరు 26 అనుకున్న ముహూర్తాన్ని పదిరోజులు వెనక్కి జరుపుకున్నారు. మరో వారం జరిపితే మాత్రం తప్పేముంది. శాసనవ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉన్నదని, శాసనసభలో ప్రజల సమస్యల గురించి పోరాడాల్సిన తన ప్రాథమిక బాధ్యతను తాను మరచిపోలేదని జగన్ ప్రజల ఎదుట చెప్పుకోవచ్చు కదా..! పైగా ఆయన పాదయాత్రలో ఉన్నారనే నెపంతో తామెవ్వరూ సభకే వెళ్లరాదని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. అలా చేసినట్లయితే పార్టీ కి నష్టం జరుగుతుందని కూడా జగన్ తెలుసుకోవాలనేది పలువురి వాదన.