అదీ, ఇదీ చంద్రబాబే.. ఇదే నిజం.!

అసెంబ్లీ సాక్షిగా కేంద్రంపై దుమ్మెత్తి పోసేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో కేంద్రం సృష్టిస్తోన్న అడ్డంకుల నేపథ్యంలో, చంద్రబాబు వీరావేశానికి గురవడం చూశాం. ‘మీరే పూర్తి చేస్తారా.? ఇప్పటికిప్పుడు ప్రాజెక్ట్‌ని మీకే అప్పగించేయడానికి సిద్ధం. ఇప్పుడు ప్రాజెక్ట్‌ ఆగితే ఇక కట్టలేం. చాలా విషయాల్లో సంయమనం పాటించాం. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..’ అంటూ చంద్రబాబు అంతలా ఆవేశపడ్తోంటే, ఏంటీ నిజమేనా.? అని చాలామందికి అనుమానం కలిగింది.

కానీ, చంద్రబాబులో ఎప్పుడూ రెండు కోణాలుంటాయండోయ్‌. ఓ యాంగిల్‌లో రౌద్రం కన్పిస్తోంటే, ఇంకో కోణంలో ‘బేలతనం’ కన్పిస్తుంటుంది. అదే చంద్రబాబు స్పెషాలిటీ. నిన్న అలా కేంద్రంపై మండిపడిపోయిన చంద్రబాబు, ఈ రోజు బేలగా పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ‘కేంద్రాన్ని ఏమీ అనొద్దు..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ‘కేంద్రంతో కలిసి ముందుకు వెళుతున్నాం.. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో కలిసి పనిచేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదు..’ అంటూ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు చిలకపలుకులు పలికారు.

‘ప్రాజెక్ట్‌ విషయంలో రాజీ పడొద్దు. అలాగని కేంద్రాన్ని తొందరపడి విమర్శించొద్దు. కేంద్రంతో మాట్లాడేందుకు ప్రయత్నిద్దాం. కేంద్రమే వేగంగా నిర్మిస్తామని చెబితే, ఇచ్చేద్దాం..’ అని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించడం, దానికి తగ్గట్టుగా టీడీపీ నేతలు నిన్నటి ‘ఫైర్‌’ తగ్గించి, ‘చల్ల చల్లగా’ కొత్త కథలు చెప్పడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఈ కథలో నీతి ఏంటి.? నిన్న ఆవేశపడిందీ చంద్రబాబే.. నేడు ఆలోచనలో పడిందీ చంద్రబాబే. నిన్న కేంద్రంపై కస్సుబుస్సులాడిందీ చంద్రబాబే.. ఈ రోజు కేంద్రం పట్ల అపారమైన భక్తిని ప్రదర్శిస్తున్నదీ చంద్రబాబే. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలతో చంద్రబాబుకి సంబంధం లేదనీ, కేంద్రంతో వ్యక్తిగత సఖ్యత ముందు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టేయడం పెద్ద వింతేమీకాదని అర్థమవడంలేదూ.! దటీజ్‌ చంద్రబాబు.