అప్పట్లో రామ్, ఎన్టీఆర్.. ఇప్పుడు రవితేజ

కొన్ని రోజుల కిందటి మాట. తన కొత్త సినిమాలో రామ్ అంధుడిగా కనిపించబోతున్నాడంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు అలాంటిదే మరో అంధుడి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తాడంటూ కథనాలు వచ్చాయి. వాటి తర్వాత కళ్లు లేని పాత్రతో రాజా ది గ్రేట్ సినిమాకు రవితేజ ఓకే చేశాడు. మరి గతంలో రామ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన స్టోరీలేంటి..? ఎట్టకేలకు ఈ సస్పెన్స్ కు తెరదించాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

“ఈ కథ అనుకున్నప్పుడు మొదట రామ్ కు వినిపించిన మాట వాస్తవమే. తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు కూడా వెళ్లాను. రామ్ కు చెప్పిన కథనే ఎన్టీఆర్ కు కూడా చెప్పాను. కానీ రవితేజతో ఇప్పుడు చేసిన రాజా ది గ్రేట్ సినిమా మాత్రం రామ్, ఎన్టీఆర్ కు చెప్పిన కథ కంటే ఇంకా మెరుగైంది. గతంలో ఎన్టీఆర్ కు చెప్పిన కథకు రాజా ది గ్రేట్ కు సంబంధం లేదు.”

స్టోరీ లైన్ అదే అయినప్పటికీ టోటల్ గా కథను మార్చేశానని అంటున్నాడు రావిపూడి. అప్పట్లో టైం లేకపోవడం వల్లనే ఎన్టీఆర్ కు పూర్తిస్థాయిలో కథ వినిపించలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీకి రీమేక్ అనే విషయంపై కూడా స్పందించాడు.

“ఇది ఏ మూవీకి రీమేక్ కాదు. ఏ దర్శకుడైనా కొన్ని సినిమాలు చూసి స్పూర్తి పొందుతాడు. నేను కూడా అలానే కొన్ని సినిమాలు చూసి వాటి స్ఫూర్తితో రాసుకున్న కథ ఇది. మక్కికి మక్కి ఏ సినిమా చూసి కాపీ కొట్టలేదు.”

బ్లయిండ్ ఫ్యూరీ, యోధ, కనుపాప లాంటి సినిమాలు చూసి ఈ స్టోరీ రాసుకున్నానని, కానీ ఆర్ట్ ఫిలింలా కాకుండా ఇందులో తన మార్క్ వినోదం పుష్కలంగా ఉంటుందంటున్నాడు దర్శకుడు.