అమరావతి అటకెక్కి.. విశాఖ గుర్తుకొచ్చి.!

బా..బ్బో..య్‌.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి, విశాఖపట్నం గుర్తుకొచ్చేసింది. ఒట్టు.. ఇది నిజ్జంగా నిజం. అంతర్జాతీయ స్థాయి నగరం అమరావతి.. అనే మాటలు ఇకపై చంద్రబాబు నోట విన్పించవని ఖచ్చితంగా చెప్పేయలేంగానీ, ప్రస్తుతానికైతే అమరావతి పేరుని పక్కన పెట్టి, తాజాగా విశాఖ పల్లవిని ఆయనగారు అందుకోవడం చిత్ర విచిత్రంగా అన్పించకమానదు.

సినీ పరిశ్రమకు విశాఖ అనుకూలంగా వుంటుందన్న విషయం తాపీగా చంద్రబాబుకి ఇప్పుడే గుర్తుకొచ్చింది. పలువురు సినీ ప్రముఖులు విశాఖలో పెట్టుబడులు పెట్టి, స్టూడియోలు నిర్మించడానికి ముందుకొచ్చేస్తున్నారట. చంద్రబాబు తాజాగా సెలవిచ్చారు ఈ విషయాన్ని. విశాఖ రెడీమేడ్‌ సిటీ అనీ, అమరావతి ఫ్యూచర్‌ సిటీ అనీ చంద్రబాబు చెప్పడంతో షాక్‌ అవడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం వంతయ్యింది.

విశాఖ రెడీమేడ్‌ సిటీనే.. ఈ విషయం ఇప్పుడు కొత్తగా చంద్రబాబుకి గుర్తుకొచ్చిందంతే. అమరావతిని కొత్తగా నిర్మించుకోవాలి. చిన్నపిల్లాడినడిగినా చెబుతాడు ఈ మాటల్ని. కానీ, విశాఖని చంద్రబాబు ‘వాడుకోవాల్సిన రీతిలో’ వాడుకోలేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. కృష్ణా – గుంటూరు జిల్లాల్లో ఓ బలమైన సామాజిక వర్గం ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు.. అమరావతిని రాజధానిగా ప్రకటించారనే ఆరోపణలు ఇప్పటికీ విన్పిస్తూనే వున్నాయి. అసలు అమరావతికి ఇప్పుడు ఆ శక్తులే అడ్డుతగులుగుతున్నాయనే ఆరోపణలూ లేకపోలేదు.

‘నందుల పండగ’ సందర్భంగా చంద్రబాబు, సినీ పరిశ్రమని – విశాఖకు అనుసంధానం చేసేశారు తన మాటల్లో. గడచిన మూడున్నరేళ్ళలో చంద్రబాబు ఒక్కసారంటే ఒక్కసారి కూడా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించిన దాఖలాల్లేవు. ఇప్పుడు మాత్రం, సినీ పరిశ్రమ ఏకంగా హైద్రాబాద్‌ నుంచి విశాఖకు తరలిపోయేందుకు పరిస్థితులు అనుకూలంగా వున్నాయంటూ సంకేతాలు పంపేస్తున్నారు.

ఏంటీ, నందుల పండగతోనే సినీ పరిశ్రమకి వున్నపళంగా ఆంధ్రప్రదేశ్‌ మీద అమితమైన మమకారం పెరిగిపోయిందా.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం. ఒక్కటి మాత్రం నిజం.. అమరావతి ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశమే లేదు. నిన్న మొన్నటిదాకా డిజైన్ల పేరుతో జరిగిన హడావిడి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. 2019 ఎన్నికల్లోపు అసలు అమరావతిలో అధికారిక భవనాల నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశమూ కన్పించడంలేదు. దాంతో, చంద్రబాబు అమరావతిని అటకెక్కించి, విశాఖ మీదకి దృష్టిని మళ్ళించారనుకోవాలేమో.! దానికి, ఇదిగో ఇలా సినీ పరిశ్రమ పేరుతో ‘టచప్‌’ ఇస్తున్నారన్నమాట.