అసెంబ్లీ సీట్లు పెంచుతార్ట : కండిషన్స్ అప్లై!

2019 ఎన్నికల్లోగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగడం అనే వ్యవహారం అటకెక్కిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. కేసీఆర్ గానీ, చంద్రబాబు గానీ.. ఈ డిమాండుతో కేంద్రం వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా సరే.. వారు పట్టించుకోకపోయేసరికి… వారు కూడా ఆశలు వదిలేసుకున్నారు.

నిజానికి ఈ విభజన చట్టం ఇచ్చిన వెసులుబాటును అమల్లోకి తీసుకురావడంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాల్లోని తమ పార్టీ శాఖల అభిప్రాయాలను తీసుకున్నారని, వారు మోకాలడ్డడంతోనే పట్టించుకోలేదని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా సీట్లు పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. సీట్లు పెరగవచ్చు గానీ.. పెరిగే సీట్ల మీద భాజపాకు కొన్ని ప్రత్యేకమైన ఆశలు కూడా ఉన్నాయనే ప్రచారం వినిపిస్తోంది.

రెండు రాష్ట్రాల్లో చూసినట్లయితే.. సీట్ల పెంపు అనేది చంద్రబాబుకు చాలా ఎక్కువ అవసరం. తెలంగాణ కేసీఆర్ కు పార్టీ మీద గుత్తాధిపత్యం నడుస్తోంది. ఆయన టికెట్ నిరాకరిస్తే ధిక్కరించే వాళ్లు తక్కువ. చంద్రబాబునాయుడు.. కేవలం నియోజకవర్గాలు పెరుగుతాయి అనే ఆశను తాయిలంలాగా చూపించి.. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలతో పాటూ అనేక మంది ఇతర స్థాయి నాయకులను కూడా తన పార్టీలో కలిపేసుకున్నారు. రేపు ఎన్నికలు వచ్చే సమయానికి వారంతా టికెట్ల కోసం గొడవ చేసే అవకాశం ఉంటుంది. ఆ గొడవల్తో పాటూ పార్టీలో పాతవారు, కొత్తవారి విభేదాలు పెరుగుతాయి. సీట్లు పెరిగితే అందరికీ సర్దుబాటు చేయవచ్చు. ఇలాంటి లెక్కలతో ఆయన పదేపదే దానికోసం ప్రయత్నించారు.

అయితే ఇన్నాళ్లూ ఈ విజ్ఞప్తులను పట్టించుకోని కేంద్రంలో ఇప్పుడు కాస్త కదలిక వచ్చిందని తెలుస్తోంది. ప్రత్యేకించి ఏపీ భాజపా ఇందుకు అనుకూలంగా కేంద్రంలో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. సీట్లు పెంచేట్లయితే చంద్రబాబుకు కేంద్రం కొన్ని కండిషన్స్ పెడుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఏపీలో పెరిగిన తర్వాత ఏర్పడే మొత్తం సీట్లలో కనీసం మూడింట ఒక వంతు సీట్లను తమకు కేటాయించాలనేది భాజపా నిబంధన. ఆ లెక్కన సుమారు 70సీట్లలో అయినా భాజపా పోటీచేసే అవకాశం దక్కించుకుంటుంది. ఆ రకంగా.. పార్టీని ఏపీలో విస్తరించుకోవాలనే ప్లాన్ తో వారున్నారు. ఏపీలో బీజేపీ బలం పుంజుకోడానికి ఇదొక్కటే దారి.. అని ఏపీ భాజపా పెద్దలు ఢిల్లీ వర్గాలతో చెప్పిన తర్వాతే ఈ ఫైలు కదిలినట్లు తెలుస్తోంది.

కానీ భాజపా బలం పెరగడం అనేది చంద్రబాబుకు ప్రమాద సంకేతమే. ఎందుకంటే.. ఎక్కువ సీట్లు వారు గెలుచుకుంటే.. చంద్రబాబును అదుపాజ్ఞల్లో పెట్టడం మాత్రమే కాదు.. ఏదో విపత్కర పరిస్థితుల్లో తాము జగన్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని బెదిరించే ప్రమాదం కూడా పుట్టుకొస్తుందని.. జగన్ కూడా వారికి సన్నిహితంగానే ఉన్నారు గనుక ఈ వాదనను కొట్టిపారేయలేం అని పలువురు వాదిస్తున్నారు.