ఆమె ఒక్కరు చాలు… బాబుకు కనిపిస్తాయ్ చుక్కలు!

రాజకీయ పార్టీల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రత్యర్థి ఉంటారు. తతిమ్మా ప్రత్యర్థులు ఎందరు ఎన్ని రకాలుగా దాడులు చేసినా.. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసినా.. కొందరు నాయకులు వాటిని దీటుగా ఎదుర్కొన గలరు! కానీ ఆ నిర్దిష్టమైన ప్రత్యర్థి ఎదురైతే మాత్రం మారు మాట్లాడలేరు. అందుకు వారికి ఉండగల కారణాలు ఏమైనా కావొచ్చు. కానీ కలవరపడుతూ ఉంటారు. ఆ కలవరపాటులో ఇతర పొరబాట్లు కూడా చేస్తుంటారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విషయంలో అలాంటి అనుకూల ప్రత్యర్థిగా భాజపాకు చెందిన పురందేశ్వరి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఏపీ భాజపాలో రెండు గ్రూపులు ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. ఒకటి చంద్రబాబు భజన గ్రూపు అయితే.. రెండోది ఆయన కంటినలుసు లాంటి గ్రూపు. రెండో గ్రూపులో ప్రముఖులుగా సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి తదితరులు ఉన్నారు. వీళ్లంతా తమకు ఛాన్సు దొరికితే చాలు చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ ఉంటారు. అందులో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి. సోము వీర్రాజు ప్రభుత్వంలో తెగ అవినీతి జరిగిపోతున్నదని చెప్పే నాయకుడు అయితే.. ఇటు పురందేశ్వరి చంద్రబాబు చేస్తున్నదంటూ ఏమీలేదు.. అంతా మా కేంద్రప్రభుత్వం ఇస్తున్నదే అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

అయితే భాజపా నాయకులు ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా.. పల్లెత్తు మాటనకుండా మౌనంగా ఉండడం చంద్రబాబునాయుడు అలవాటు చేసుకున్నారు. మిత్రపక్షం విమర్శల పట్ల స్పందించవద్దని ఆయన తన పార్టీ వారికి హితవు చెబుతుంటారు. ప్రత్యేకించి పురందేశ్వరి ఎన్ని మాటలు అన్నా.. చంద్రబాబునాయుడు స్పందించినది లేదు.

పురందేశ్వరి ఇప్పుడు రెండో అంచె.. బాబు వ్యతిరేక ధోరణిలోకి ప్రవేశించారు. ఏపీ భాజపాను విస్తరించడం అనే కోటాలో.. ఆమె చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబును పార్టీలోకి తీసుకువచ్చారు. పార్టీలోని అభిజ్ఞవర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఇంకా ఇలాంటి అనేక మంది నాయకులను ఆమె భాజపాలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. భాజపా మద్దతు అవసరం లేకపోయినా సరే.. నియోజకవర్గాల్లో గెలవగల నాయకులు కొందరిని తీసుకువస్తానని ఆమె పార్టీకి హామీ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు.

అంటే.. దాదాపుగా చంద్రబాబు అంటే పడని నాయకులు పలువురు భాజపాలోకి వస్తారన్నమాట. తెదేపా మద్దతు లేకుండా విడిగా ఎన్నికల్లో తలపడినా కనీసం 20 సీట్లు సొంతంగా దక్కించుకునే పరిస్థితి ఏర్పడుతుందనే హామీతో పురందేశ్వరి ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఒక్కటే భాజపాతో తెదేపా మైత్రి మంటగలిసిపోయేలా.. భాజపాలో అదనపు ఆశలు రేకెత్తించి.. చేతనైనంత వరకు చంద్రబాబుకు చేటు చేయగలదని పలువురు భావిస్తున్నారు.