హైదరాబాద్ కు వైకాపా ఇక కటీఫ్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు- హైదరాబాదు నగరంతో అనుబంధం దాదాపుగా తెగిపోబోతున్నది. ఈ తెగనున్న బంధంతో.. వారు తెలుగుదేశం పార్టీనుంచి తరచూ వస్తున్న అనేక రకాల విమర్శలకు అడ్డుకట్ట వేయబోతున్నారు. విమర్శకుల నోటికి తాళం వేయబోతున్నారు. ఇప్పటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్ఠీ కేంద్ర కార్యాలయం హైదరాబాదు లోటస్ పాండ్ లో నే ఉండడం… అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసం కూడా ఇక్కడే ఉండడం ఆ పార్టీ నాయకులకు కాస్త ఇబ్బందిగానే ఉండేది. పార్టీ సమావేశాలు ఏవి పెట్టుకున్నా, అధినేతను కలవాలన్నా హైదరాబాదుకు రాక తప్పని పరిస్థితి. ఈ దుస్థితికి ఇప్పుడు దాదాపుగా తెర పడినట్టే అనుకోవాలి.

ఇవాళ (3 నవంబరు) జగన్మోహన్ రెడ్డి బయల్దేరి తిరుమల వెళ్లారు. అక్కడినుంచి కడపకు వచ్చి.. అక్కడే రెండు రోజులు పెద్ద దర్గా, చర్చిల్లో ప్రార్ధనలు చేసి.. 6 వతేదీన పాదయాత్రకు బయల్దేరుతారు. అంటే ఇవాళ్టితో ఇక వైకాపా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నాయకులు హైదరాబాదుకు రావాల్సిన అవసరం తగ్గిపోయినట్టే లెక్క. అధినేత ఇక్కడ ఉండరు. ప్రతిశుక్రవారమూ హైదరాబాదుకు వస్తారు గానీ.. ఆ రోజుల్లో బహుశా ఆయనకు ఎవరినైనా కలిసేంత తీరిక ఉండకపోవచ్చు. ఆ ఒక్కరోజు ఆయనను డిస్టర్బ్ చేయడానికి ఎవరూ రాకపోవచ్చు.

పార్టీ కార్యకలాపాల పరంగా చూసినా.. ఇప్పటికే విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు అయింది. ప్రారంభం అయింది. చాలా కార్యకలాపాలు అక్కడే జరుగుతున్నాయి. మరో శాశ్వత భవనం నిర్మాణం కూడా జరుగుతోంది. జగన్ అక్కడే ఒక నివాసం ఏర్పాటుచేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఒకవేళ ఆయన పాదయాత్ర పూర్తయ్యేలోగా జగన్ తనకోసం అనుకుంటున్న నివాసం కూడా నిర్మాణం పూర్తయితే.. ఇక ఆయన అక్కడే ఉంటారు. అంటే దాదాపుగా వైకాపా నాయకులు అందరికీ.. వ్యవహారాలు అమరావతి, బెజవాడ కేంద్రంగానే నడుస్తుంటాయి తప్ప.. హైదరాబాదుతో పని ఉండదు.

ఇప్పటిదాకా వైకాపా నాయకులు నాన్ రెసిడెంట్ ఆంధ్రైట్స్ అని.. ఎన్నారైలు లాంటి వారని.. అంతా హైదరాబాదునుంచి ఏపీ వ్యవహారాలు నడిపిస్తుంటారని.. తెదేపా వారు దెప్పి పొడుస్తున్నారు. అలాంటి విమర్శలకు పూర్తిగా తెర పడుతుందని అనుకోవచ్చు.