ఆ పాత్రలో మళ్ళీ మళ్ళీ: ప్రియాంక

బాక్సర్‌ మేరీకోమ్‌ మరోసారి సత్తా చాటారు. ఏషియన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ని సొంతం చేసుకున్నారు. ఈ ఘనత నేపథ్యంలో ఆమెకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా, ఆన్‌స్క్రీన్‌ మేరీకోమ్‌.. అదేనండీ ప్రియాంకా చోప్రా, ‘ఇండియాస్‌ డాటర్‌’ అంటూ మేరీకోమ్‌ని అభివర్ణించడమే కాదు, ఆమె జీవిత చరిత్రలో తెరకెక్కిన సినిమాలో ఆమెలా నటించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అనీ, మళ్ళీ మళ్ళీ అలాంటి పాత్రల్లోనే నటించాలని వుందనీ చెప్పుకొచ్చింది.

మేరీకోమ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మేరీకోమ్‌’లో ప్రియాంకా చోప్రా నటించిన విషయం విదితమే. మేరీకోమ్‌లా కన్పించేందుకు, కఠినమైన కసరత్తులు చేయడమే కాదు, స్వయంగా మేరీ కోమ్‌ వద్ద కూడా బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంది ప్రియాంకా చోప్రా. సినిమా కోసం చేసిన కసరత్తులు, బాక్సాంగ్‌ ప్రాక్టీస్‌లో ప్రియాంకా చోప్రా చాలా దెబ్బలు తినేసింది కూడా.! ఓ దశలో ఆమె ఫిజిక్‌ డిఫరెంట్‌గా మారిపోయింది. అయినా, అవేమీ పట్టించుకోలేదు ప్రియాంకా చోప్రా.

‘ఇలాంటి కష్టం ఇంకెవరికీ రాకూడదు. నటించడమే ఇంత కష్టంగా వుంటే, రియల్‌ లైఫ్‌లో మేరీకోమ్‌ ఇంకెంతలా కష్టపడిందో.! ఆ కష్టం ముందు నా కష్టం చాలా చాలా తక్కువ..’ అని గతంలో చెప్పిన ప్రియాంక, మళ్ళీ ఇంకోసారి ఆ కష్టాన్ని ఇష్టంగా అనుభవించడానికి సిద్ధంగా వున్నానని విశేషమే మరి. ఈ తరానికి మేరీకోమ్‌ జీవితం గురించి, జీవితంలో ఆమె సాధించిన విజయాల గురించీ ఇంకా ఇంకా తెలియాలన్నదే తన ఉద్దేశ్యమని ప్రియాంకా చోప్రా చెబుతోంది.